Google AI Mode| గూగుల్ ఇటీవల ప్రకటించిన కొత్త ఏఐ మోడ్ వెబ్ సెర్చింగ్ ప్రపంచంలో షేక్ చేయనుంది. ఎందుకంటే గూగుల్ లో ఏదైనా సెర్చ్ చేస్తే ఇకపై అదే డైరెక్ట్ సమాధానం ఇచ్చేస్తుంది. ఇతర ఎక్స్‌టర్నల్ వెబ్ సైట్ల లింకులు లేకుండా గూగుల్ స్వయంగా యూజర్ల ప్రశ్నలకు డైరెక్ట్‌గా సమాధానాలు, వివరణ, సూచనలు ఇచ్చేస్తుంది. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారబోతోందని టెక్ నిపుణులు, వెబ్‌సైట్ యజమానులు, పబ్లిషర్ల మధ్య చర్చ జరుగుతోంది. ఈ కొత్త ఫీచర్ సాధారణ సెర్చ్ ఫలితాలను ఏఐ ద్వారా రూపొందించిన సమాధానాలతో భర్తీ చేస్తుంది. దీని వల్ల ఇంటర్నెట్‌లో సమాచారం సెర్చ్ చేయడం, చదవడం అనే ప్రక్రియ అనేది పూర్తిగా మారపోవచ్చు.
గూగుల్ ఏఐ మోడ్ అంటే ఏమిటి?
గత నెలలో జరిగిన గూగుల్ ఐ/ఓ ఈవెంట్‌లో ఈ ఏఐ మోడ్‌ను ప్రకటించారు. ఈ ఫీచర్.. వినియోగదారులకు వెబ్‌సైట్‌లను క్లిక్ చేయకుండానే వేగంగా, నేరుగా సమాధానాలను అందిస్తుంది. ఇది సమయాన్ని ఆదా చేసినప్పటికీ, ఇంటర్నెట్ వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు.
బీబీసీ నివేదిక ప్రకారం.. వెబ్‌సైట్‌ల ట్రాఫిక్ తగ్గి, ప్రకటనల ఆదాయం తగ్గడం వల్ల స్వతంత్ర పబ్లిషర్ల ఉనికి ప్రమాదంలో పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్సివ్ నుండి ఎస్‌ఈఓ నిపుణురాలు లిలీ రే మాట్లాడుతూ.. గూగుల్ ఏఐ మోడ్‌ను డిఫాల్ట్‌గా చేస్తే, పబ్లిషర్లు తమ ట్రాఫిక్, ఆదాయంలో గణనీయమైన భాగాన్ని కోల్పోవచ్చని చెప్పారు.
గూగుల్ మాత్రం ఓపెన్ వెబ్‌ను విలువైనదిగా భావిస్తున్నామని, వినియోగదారులకు కంటెంట్‌ను కనుగొనేలా సహాయం చేయడం తమ ప్రాధాన్యం అని చెబుతోంది. “మేము రోజూ బిలియన్ల క్లిక్‌లను వెబ్‌సైట్‌లకు పంపుతాము. వెబ్‌తో ప్రజలను కనెక్ట్ చేయడం మా ప్రధాన లక్ష్యం,” అని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు.
ఏఐ మోడ్‌తో ఆందోళనలు, విమర్శలు
కొంతమంది గూగుల్ వాదనలను నమ్మడం లేదు. గతంలో ప్రవేశపెట్టిన ఏఐ ఓవర్‌వ్యూస్ ఫీచర్ వల్ల వెబ్‌సైట్‌లకు వచ్చే ట్రాఫిక్ ఇప్పటికే తగ్గిందని విమర్శకులు సూచిస్తున్నారు. ఈ కొత్త ఏఐ మోడ్.. ఓపెన్ వెబ్‌ను మరింత దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ వెబ్ అనేది వేలాది స్వతంత్ర వెబ్‌సైట్‌లతో కూడిన వ్యవస్థ, ఇది అందరికీ సమాచారాన్ని అందించేలా చేస్తుంది.
పోలెమిక్ డిజిటల్ సంస్థాపకుడు బ్యారీ ఆడమ్స్ మాట్లాడుతూ.. ఏఐ మోడ్ వెబ్‌సైట్‌లను పూర్తిగా నాశనం చేయకపోయినా, వాటి ప్రభావం, రీచ్‌ను గణనీయంగా తగ్గిస్తుందని చెప్పారు. వినియోగదారులు వెబ్‌సైట్‌లను సందర్శంచడం కంటే గూగుల్ ఏఐ సమాధానాలపై ఆధారపడితే, ఇంటర్నెట్‌లో వైవిధ్యమైన అభిప్రాయాలు తగ్గి, కేవలం యంత్రాలు ఆధిపత్యం చేసే వెబ్‌గా మారవచ్చు.
భవిష్యత్తు ఏంటి?
గూగుల్ ఏఐ మోడ్‌ను అమలు చేస్తుండడంతో, టెక్ ప్రపంచం దీని ప్రభావాన్ని గమనిస్తోంది. కొంతమంది ఈ ఫీచర్ సెర్చ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అయితే, మరికొంతమంది ఇది ఆన్‌లైన్ ఈకో సిస్టమ్‌కు హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈకోసిస్టమ్ వార్తలు, పరిశోధన, జ్ఞానం కోసం చాలా మంది ఆధారపడే వేదిక.
Also Read: ఫోన్‌లో డేటా దొంగిలిస్తున్న ఏఐ.. ప్రమాదంలో యూజర్ ప్రైవసీ
వచేన మాసాలలో ఈ మార్పు ఇంటర్నెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. ఇంటర్నెట్ ఈ కొత్త వ్యవస్థకు అనుగుణంగా మారుతుందా లేదా ఏఐ-ప్రధాన సెర్చ్ వల్ల పెద్ద మార్పులు వస్తాయా అనేది సమయమే నిర్ణయిస్తుంది.