Beerakaya kothimeera pachadi: భోజనంలో ఎన్ని రకాల కూరలు ఉన్నా, ప్లేట్‌లో పక్కన నూరిన రోటి పచ్చడి ఉంటే ఆ మజాయే వేరు. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కమ్మని రోటి పచ్చడితో తింటే.. అద్భుతం. అయితే రొటీన్ పచ్చళ్లకు భిన్నంగా ఆరోగ్యకరంగా , రుచికరమైన టేస్ట్ ఉండే.. ఒక అద్భుతమైన రెసిపీ గురించిన ఇప్పుడు చూద్దాం.
అద్దిరిపోయే రుచితో బీరకాయ కొత్తిమీర పచ్చడి:
మన తెలుగు రాష్ట్రాల్లో పచ్చళ్లకు ఉండే క్రేజే వేరు. టమోటా, గోంగూర, పుదీనా పచ్చళ్లు రెగ్యులర్‌గా చేసుకుంటూనే ఉంటాం. అయితే కొంచెం భిన్నంగా, నోటికి కారకారంగా రుచిని అందించే కూరగాయల్లో బీరకాయ ముందుంటుంది. ఈ బీరకాయతో పాటు తాజా కొత్తి మీరను కలిపి చేసే ఈ పచ్చడి తింటే ఎవరికైనా సరే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
బీరకాయలు: అర కేజీ (లేతవి)
కొత్తిమీర: ఒక కట్ట
పచ్చిమిర్చి: 10 నుంచి 12
పల్లీలు: 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
టమోటాలు: 2
ఉల్లిపాయలు: 1
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజ్ అంత
వెల్లుల్లి రెబ్బలు: 6 నుంచి 8
పసుపు, ఉప్పు: సరిపడా
తాలింపు గింజలు: ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ.
1.ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులో ధనియాలు, జీలకర్ర, పల్లీలు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత పచ్చి మిర్చి వేసి రంగు మారే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
2. అదే బాండీలో మరి కొంచెం నూనె వేసి పొట్టు చెక్కుకున్న బీరకాయ ముక్కలను వేసి మెత్తగా మగ్గించుకోవాలి. బీరకాయల్లోని నీరంతా ఇగిరి పోయే వరకు ఉడికించాలి.
3.టమోటా, కొత్తిమీర చేర్చడం: బీరకాయలు మగ్గిన తర్వాత తరిగిన టమాటొ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, పసుపు , కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. టమోటోలు మెత్తబడిన తర్వాత చివరగా కొత్తి మీర తరుగు వేసి మరో మూడు నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి.
4. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చి మిర్చి, పల్లీల మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బీరకాయ మిశ్రమాన్ని కూడా అందులో వేసి మరీ మెత్తగా కాకుండా రోట్లో నూరినట్లు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందుకు రోలు వాడితే రుచి అద్భుతంగా ఉంటుంది.
5.చివరగా ఒక చిన్న పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఈ తాలింపును మనం సిద్ధం చేసుకున్న పచ్చడిలో కలిపితే సరి పోతుంది.
వేడి వేడి అన్నంలో ఈ బీరకాయ కొత్తిమీర పచ్చడిని వేసుకొని, పైనుంచి స్వచ్ఛమైన నెయ్యి వేసుకొని తింటుంటే.. ఆ కిక్కే వేరు. ఇది కేవలం అన్నంలోకే కాకుండా దోసెలు, చపాతీల్లోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్‌లో మీ ఇంట్లో కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి.