AI Air Conditioner: నేటి ఆధునిక యుగంలో ఇంటికి కొత్త ఏసీ కొనాలని మార్కెట్‌లోకి వెళ్తే.. సాధారణ ఏసీల కంటే AI ఏసీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గదిలో ఉష్ణోగ్రత, వాతావరణం, మనుషుల సంఖ్యను బట్టి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా మార్చేస్తామని, కరెంట్ బిల్లును కూడా తగ్గిస్తామని కంపెనీలు చెబుతున్నాయి. కానీ ఈ స్మార్ట్ ఫీచర్ల కోసం సాధారణ ఏసీ కంటే అదనంగా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మరి ఏఐ ఏసీ కొనడం నిజంగా తెలివైన నిర్ణయమేనా? కరెంట్ బిల్లు నిజంగానే తగ్గుతుందా? లేక ఏఐ పేరుతో అదనపు డబ్బు ఖర్చు చేస్తున్నామా? కొనేముందు తెలుసుకోవాల్సిన అసలు విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మామూలు ఏసీలతో పోలిస్తే.. ఈ ఏఐమోడళ్ల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఉదా: ఒక సాధారణ విండో ఏసీ దాదాపు రూ.20,000 నుంచి లభిస్తే.. ఏఐ ఫీచర్లు ఉన్న మోడళ్ల ధర రూ.31,000 దాటుతోంది. ఇక శాంంసంగ్ వంటి బ్రాండ్లలో ప్రైమియమ్ ఏఐ మోడళ్లు లక్ష రూపాయల వరకు ఉన్నాయి. కేవలం పవర్ సేవింగ్స్ ఆశించి అంత పెద్ద మొత్తంలో ముందే ఖర్చు చేయడం నిజంగా అవసరమా అని ఆలోచించాల్సిన విషయమే.
ఈ ఏసీలు గదిలో ఉన్న ఉష్ణోగ్రత, బైటి వాతావరణం, ఇంట్లో ఉన్న మనుషుల సంఖ్యను అంచనా వేసి పనిచేస్తాయి. మనుషులకు, పెంపుడు జంతువులకు తేడాను గుర్తించి అనుకూలమైన కూలింగ్ ఇస్తాయి. కొన్ని మోడళ్లు 30 శాతం వరకు కరెంట్ ఆదా చేస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. గదిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
Also Read: ఆఫర్ ధర కన్నా లాంచ్ ధరే తక్కువ.. స్మార్ట్‌ఫోన్ సేల్స్ వెనుక పెద్ద స్కెచ్, కొనేముందు జాగ్రత్త!
మీ వద్ద బడ్జెట్ పరిమితంగా ఉంటే ఏఐ ఏసీలే కొనాల్సిన పనిలేదు. తక్కువ ధరకు లభించే వైఫై ఏసీలతో కూడా ఫోన్ ద్వారా టైమింగ్స్ సెట్ చేసుకుని కరెంట్ ఆదా చేయవచ్చు. లేదా సాధారణ ఏసీని కొని, కేవలం రూ.8,000 లోపు లభించే స్మార్ట్ ఐఆర్ బ్లాస్టర్ పరికరాన్ని అమర్చడం ద్వారా దాన్ని స్మార్ట్ ఏసీగా మార్చుకోవచ్చు. దీనివల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది.
ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఏసీ రంగంలో ఇప్పుడే మొదలైన కొత్త ప్రక్రియ. భవిష్యత్తులో ఇవి ఎంతవరకు నిలబడతాయో కాలమే చెప్పాలి. పైగా రాబోయే రోజుల్లో వీటి ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి.. ఇప్పుడు అత్యవసరం కాకపోతే ఈ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేవరకు వేచి చూడటమే సరైన నిర్ణయం.
Also Read: iPhone 18 Pro కొనే ప్లాన్ ఉందా? బ్యాటరీ టెస్ట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలివే!