Adoption Rights: పుట్టుకతో వచ్చినా, దత్తత ద్వారా చేరినా కూతురంటే కూతురేనని కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ రికార్డుల్లో పిల్లలను ‘దత్తపుత్రుడు’ లేదా ‘దత్తపుత్రిక’ అని ప్రత్యేకంగా పేర్కొనడం తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నపిల్లలకు, దత్తత తీసుకున్న పిల్లలకు మధ్య ఎలాంటి తేడా చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
కేరళ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రత్మక తీర్పు వెనుక ఓ మహిళ ఆత్మగౌరం దాగుంది. కోర్టు ఆమె అసలు పేరును బయటపెట్టకుండా ‘అన్మోల్’ (వెలకట్టలేనిది అని అర్థం) అనే పేరుతో ఆమెను సంబోధించింది. 1990 జూన్‌లో నెల రోజుల వయసున్న అన్మోల్‌ను పిళ్లై దంపతులు దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమెను తమ సొంత కూతురిలాగే పెంచి పెద్దచేశారు. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, విద్యా ధృవీకరణ పత్రాలు.. ఇలా ప్రతి అధికారిక పత్రంలోనూ ఆమె వారి ‘కూతురు’గానే నమోదైంది.
2023 జనవరిలో అన్మోల్ తల్లి మరణించినప్పుడు అధికారులు జారీ చేసిన వారసత్వ ధృవీకరణ పత్రంలో (Legal Heirship Certificate) ఆమెను ‘కూతురు’ అనే పేర్కొన్నారు. కానీ 2024 అక్టోబర్‌లో తండ్రి మరణించిన తర్వాత పరిస్థితి మారింది. త్రిస్సూర్ తహసీల్దార్ జారీ చేసిన కొత్త వారసత్వ ధృవీకరణ పత్రంలో ఆమె పేరు పక్కన ‘దత్తపుత్రిక’ అని చేర్చారు.
ఆ ఒక్క అదనపు పదం (దత్తపుత్రిక) అన్మోల్‌ను తీవ్రంగా బాధించింది. ఆ వివరణ అనవసరమని, అది తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని అన్మోల్ భావించింది. పైగా తన వ్యక్తిగత గతం గురించి అనవసర ప్రశ్నలకు ఆ పద తావిస్తుందని ఆమె ఆందోళనకు గురైంది. దీంతో తనను కేవలం తన తండ్రి ‘కూతురు’గా మాత్రమే గుర్తిస్తూ కొత్త సర్టిఫికెట్ ఇప్పించాలని కోరుతూ ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ పి.వి. కున్హికృష్ణన్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ.. ఈ-డిస్ట్రిక్ట్ (e-District) పోర్టల్‌లో దత్తత తీసుకున్న పిల్లల కోసం ప్రత్యేక ఆప్షన్ ఉందని, నిబంధనల ప్రకారమే అధికారులు అలా రాశారని వివరణ ఇచ్చింది. అయితే ప్రభుత్వ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. చట్టం దృష్టిలో దత్తత తీసుకున్న బిడ్డ అన్ని విధాలా ఆ తల్లిదండ్రుల సొంత బిడ్డేనని న్యాయమూర్తి గుర్తుచేశారు. సమాజం కూడా ఎలాంటి ముద్రలు వేయకుండా వారిని సొంత పిల్లలుగానే స్వీకరిస్తోందని పేర్కొన్నారు.
‘దత్తపుత్రుడు’, ‘దత్తపుత్రిక’ అనే పదాలు అవమానకరమైనవి కాకపోయినా, ప్రభుత్వ పత్రాల్లో అలాంటి పదాలను వాడకపోవడమే ఉత్తమమని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. ‘కొన్ని బంధాలు పుట్టుకతో మొదలవుతాయి. మరికొన్ని దత్తతతో ఏర్పడతాయి. దారులు వేరైనా ‘కూతురు’ అనే పదం వెళ్లిన ప్రతిచోటా ఆ తేడాను మోయాల్సిన అవసరం లేదు’ అని న్యాయమూర్తి హృదయాన్ని హత్తుకునే వ్యాఖ్యలు చేశారు.
Also Read: Airtel జాక్‌పాట్ ప్లాన్.. రూ.598కే నెట్ ఫ్లిక్స్, అపరిమిత 5G.. జీ5, హాట్ స్టార్ సైతం ఉచితం!
అంతేకాకుండా అన్మోల్‌కు త్రిస్సూర్ తహసీల్దార్ జారీ చేసిన పాత వారసత్వ ధృవీకరణ పత్రాన్ని హైకోర్టు రద్దు చేసింది. తీర్పు కాపీ అందిన రెండు వారాల్లోగా ఆమెను కేవలం ‘కూతురు’గా గుర్తిస్తూ కొత్త సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా నెల రోజుల్లోగా ప్రభుత్వ ఈ-డిస్ట్రిక్ట్ పోర్టల్ నుంచి ‘దత్తత తీసుకున్న బిడ్డ’ అనే ప్రత్యేక ఆప్షన్‌ను తొలగించాలని, వారసత్వ ధృవీకరణ పత్రాల జారీ నిబంధనలను సవరించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.