వంట చేస్తున్నప్పుడు కళాయిలో కూర వండుతూ దాని మీద మూత పెట్టి ఆ మూతపై నీరు పోసేవారు ఎంతో మంది ఉన్నారు. చాలామంది దీన్ని కేవలం అలవాటుగా అనుకుంటారు. కానీ, ఇందులో ఒక శాస్త్రీయ కారణం ఉంది. సాధారణంగా మనం కళాయిలో కూరలు, పొటాటో ఫ్రై, బెండకాయ వేపుడు, క్యాబేజీ, బీర కాయ వంటి వేపుళ్లు వండేటప్పుడు ఎక్కువ నీరు వేయరు. ఈ సందర్భంలో కూరలో తేమ నిల్వ ఉంచడం కష్టం. అందుకే మూతపై నీరు పోసే పద్ధతి వచ్చింది. దీని వల్ల వేపుళ్లు త్వరగా మాడిపోవు.
మూతపై నీరు వేస్తే ఉపయోగాలు
ఈ పద్ధతి వల్ల పాత్రలో ఉత్పత్తి అయ్యే ఆవిరి ఎక్కువసేపు కళాయిలోనే ఉంటుంది. మూతపై వేసిన చల్లని నీరు ఆవిరిని కండెన్స్ చేసి తిరిగి ఆ కూరపై తేమగా కలిసేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల కూరలో తేమ తగ్గకుండా సహజమైన రుచితో పాటు పోషకాలు కూడా నిలిచి ఉంటాయి. ఆవిరి బయటకు వెళ్లిపోకపోవడం వల్ల వేడి సమంగా వ్యాపించి కూర త్వరగా ఉడుకుతుంది. మూతపై నీళ్లు వేయడం వల్ల మరొక ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. ఈ విధానం వల్ల కూరలు పొంగిపోవడం, మాడిపోవడం జరగదు. వేపుళ్లు ఎక్కువసేపు వేయిస్తే అవి రంగు మారిపోతుంది. కానీ మూతపై నీరు పోస్తే ఆవిరి చల్లబడటంతో కళాయిలోని వేడి నియంత్రణలో ఉంటుంది.
ఈ టిప్ ముఖ్యంగా తక్కువ నూనెతో వండే ఆరోగ్యకర వంటకాలకు బాగా సరిపోతుంది. ఉదాహరణకు బీన్స్ కర్రీ, ఆలూ కాప్సికం, క్యాబేజీ కూర, ఆకుకూరల వేపుడు వంటి వంటకాల్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రెండు మూడు టేబుల్ స్పూన్ల నీరు కళాయి మూతపై వేస్తే చాలు. నీరు వేయడం వల్ల ఆవిరి ఉష్ణోగ్రత తక్కువై, కళాయిలోని వేడి సమతుల్యంగా ఉంటుంది.
స్మార్ట్ టెక్నిక్స్
భారతీయ వంటల్లో ఇలాంటి స్మార్ట్ టెక్నిక్స్ తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఇలా వండడం వల్ల వల్ల వంట త్వరగా, రుచిగా పూర్తవుతుంది. కూరలు మాడిపోకుండా ఉంటాయి. శాస్త్రీయంగా చూస్తే ఇది ఒక రకమైన స్టీమ్ కంట్రోల్ టెక్నిక్ అని చెప్పుకోవాలి. అంటే ఆవిరి ఉష్ణోగ్రతను నియంత్రించి, వంటను సమతుల్యం చేయడమన్నమాట.
కాబట్టి ఇకపై మీరు కూర వండేటప్పుడు ఈ చిట్కా తప్పక ప్రయత్నించండి. కళాయిలో కూర వేసి మూత పెట్టండి. దాని మీద కొద్దిగా నీరు పోయండి. కూర సమానంగా ఉడకడంతో పాటూ మృదువుగా, రుచిగా ఉడుకుతుంది. వంట చేసే సమయం తగ్గుతుంది. పైగా గ్యాస్ ఆదా అవుతుంది.