Hidden Heart Attack Risk| మీరు క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారా? మీ కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ లెవల్స్ అన్నీ నార్మల్‌గా ఉన్నాయా? అయితే మీ గుండె ఆరోగ్యం గురించి పూర్తిగా నిశ్చింతగా ఉండే ముందు మరో విషయం తెలుసుకోవాలి. సాధారణ పరీక్షల్లో కనిపించని కొన్ని గుండె సంబంధిత ప్రమాద కారకాలు కూడా ఉండవచ్చు. ఈ కారకాలు రక్తంలో ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
లిపోప్రొటీన్ (a) అనేది రక్తంలో ఉండే ఒక రకమైన కణం. ఇది కొలెస్ట్రాల్ మోసుకెళ్లే పనిచేస్తుంది. ఇందులో అపోలిపోప్రొటీన్ (a) అనే అదనపు ప్రోటీన్ కూడా ఉంటుంది. ప్రముఖ లాంగెవిటీ నిపుణుడు డాక్టర్ సుమన్ రోషన్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ అంశాన్ని వివరించారు. రక్తంలో Lp(a) లెవెల్స్ ఎక్కువగా ఉంటే రక్తనాళాల గోడల్లో కొవ్వు పేరుకుపోవడం, వాపు పెరగడం వంటి సమస్యలకు దోహదపడవచ్చు. రక్తం గడ్డకట్టే ప్రక్రియపై కూడా ఇది ప్రభావం చూపవచ్చు. ఈ మార్పులు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. అయితే, ప్రతి ఒక్కరిలో Lp(a) ప్రభావం ఒకేలా ఉండదు. వైద్యులు ఇతర ఆరోగ్య అంశాలతో కలిపి ఈ స్థాయిలను అంచనా వేస్తారు.
Lp(a) లెవెల్స్‌ని ప్రధానంగా జన్యుపరమైన అంశాలు నిర్ణయిస్తాయి. తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో దీని లెవెల్స్ ఎక్కువగా ఉంటే, ఇతర కుటుంబ సభ్యుల్లో కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. సన్నగా ఉన్నవారు, వ్యాయామం చేసేవారు, శాకాహారులు కూడా అధిక Lp(a) లెవెల్స్‌ని కలిగి ఉండవచ్చు. కాబట్టి శరీర ఆకృతి లేదా ఆహారపు అలవాట్లను బట్టి దీని లెవెల్స్‌ని అంచనా వేయలేం.
సాధారణ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో LDL, HDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి అంశాలను పరిశీలిస్తారు. అయితే, ఈ పరీక్షలో Lp(a) లెవెల్స్ నేరుగా తెలియవు. అందువల్ల కొలెస్ట్రాల్ రిపోర్ట్ నార్మల్‌గా ఉన్నప్పటికీ కొందరిలో గుండె సంబంధిత ప్రమాదం ఉండవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో చిన్న వయసులోనే గుండె జబ్బులకు గురైన వారు ఎవరైనా ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Also Read: రాత్రి బెడ్‌పై పడుకున్నాక పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? ఓవర్‌థింకింగ్ తగ్గించడానికి టిప్స్
జీవితంలో కనీసం ఒక్కసారైనా Lp(a) పరీక్షను పరిగణించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని స్థాయిలు సాధారణంగా ఎక్కువ మార్పులకు లోనుకావు. అయితే, కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. మళ్లీ పరీక్ష అవసరమా లేదా అనేది వైద్యుడు నిర్ణయిస్తారు.
Also Read: డైటింగ్‌తో తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెయిట్ కంట్రోల్ టిప్స్
పరీక్షలో Lp(a) ఎక్కువగా ఉన్నట్లు తేలితే ఆందోళన చెందకుండా వైద్యుడి సలహా తీసుకోండి. LDL కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు వారంలో రెండుసార్లు బరువులు ఎత్తే వ్యాయామాలు చేయాలి. ఇవి శరీరంలో శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. Lp(a) లెవెల్స్‌ని తగ్గించే చికిత్సలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. మీ ఆరోగ్య పరిస్థితికి తగిన చికిత్సల గురించి వైద్యుడితో చర్చించండి.
గమనిక: ఈ కథనం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. పరీక్షలు, చికిత్సల విషయంలో వైద్య నిపుణులను సంప్రదించండి.