Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు నీటి మళ్లింపు, గోదావరి జలాల వినియోగంపై ప్రతిపక్ష బీఆర్ ఎస్ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గడిచిన 10 ఏళ్ల పాలనలో బీఆర్ ఎస్ చేసిన తీవ్ర తప్పిదాల వల్లే ప్రస్తుతం తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ…కాళేశ్వరం వద్ద నీటిని ఎత్తిపోయాలంటే కనీసం 93.5 మీటర్ల నీటిమట్టం ఉండాలని, కానీ ప్రస్తుతం కేవలం 89 మీటర్ల ప్రవాహం మాత్రమే ఉందన్నారు. అంటే సుమారు 4.5 మీటర్ల నీటి ప్రవాహం తక్కువగా ఉండటం వల్లే నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం గోదావరి నీళ్లను సమర్థవంతంగా వాడుకుంటోందని, బీఆర్ ఎస్ మాత్రం దేవాదుల, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
కృష్ణా నదిలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి అన్యాయం చేసింది గత బీఆర్ ఎస్ ప్రభుత్వమేననివిమర్శించారు.ప్రభుత్వంపై నిందలు వేస్తూ గోదావరి జలాలపై దుష్ప్రచారం చేయడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని అన్నారు. అసలు తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. బొగ్గు, నీళ్లు, పవర్‌తో పాటు కీలకమైన అంశాలపై బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రాష్ట్రంలో గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అన్నారు.ప్రజలు అధికారం ఇవ్వలేదనే కక్షతో కేటీఆర్, హరీష్ రావులకు 24 గంటలు రాజకీయాలు చేయడమే అజెండాగా మారిందని దుయ్యబట్టారు. కేటీఆర్ ధీమాక్ లేని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని, గడ్డం పెంచినంత మాత్రాన ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారని కేటీఆర్ భావిస్తున్నారేమో అని చురకలు వేశారు. కేటీఆర్, హరీష్ రావులు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.
సుమారు 150 ఏళ్ల తర్వాత దేశంలో తీవ్రమైన ‘ఎల్ నినో’ విపత్తు వచ్చిందని ఎంపీ చామల తెలిపారు. ఎల్ నినో పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి రివ్యూలు నిర్వహిస్తూ, అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 28న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ‘ఎల్ నినో’ ప్రభావంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు హాజరై, ఆరోపణలు మాని ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
Also read: “శరణమా? మరణమా?.. ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ సంచలన హెచ్చరిక!