నిల్వ పచ్చళ్ళు అనగానే అందరికీ చికెన్, మటన్, ఊరగాయ, రొయ్యలు, మామిడి కాయలు, ఉసిరికాయలు ఇలాంటివే గుర్తొస్తాయి. నిజానికి ఎన్నో రకాల నిల్వ పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మేము కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెసిపీ ఇచ్చాము. నిజానికి కాలీఫ్లవర్ సీజనల్ కూరగాయ అంటే చలికాలంలోనే అధికంగా దొరుకుతుంది. వేసవికాలంలో దొరకడం చాలా కష్టం. కాలీఫ్లవర్ అంటే మీకు ఇష్టమా? అయితే దీన్ని పికెల్ రూపంలో మార్చి నిల్వ చేసుకుంటే మీకు నచ్చినప్పుడు తినవచ్చు. కాలీఫ్లవర్ పికెల్ తయారు చేయడం కూడా చాలా సులువు. ఒక్కసారి చేసుకుంటే ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. ఇక కాలీఫ్లవర్ పికెల్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కాలీఫ్లవర్ పికెల్ తయారీకి కావలసిన పదార్థాలు
కాలీఫ్లవర్ – ఒకటి
నూనె – ఒక కప్పు
వెల్లుల్లి రెబ్బలు – 10
మెంతి పిండి – ఒక స్పూను
ఆవపిండి – నాలుగు స్పూన్లు
ఉప్పు – మూడు స్పూన్లు
కారం – నాలుగు స్పూన్లు
కాలీఫ్లవర్ పికెల్ రెసిపీ
1. కాలీఫ్లవర్‌ను పురుగులు లేనిది తీసి ఎంచుకోవాలి.
2. కాలీఫ్లవర్ ముక్కలను చిన్నగా కట్ చేసుకోవాలి.
3. మీకు పచ్చడిలోని ముక్కలు ఏ సైజులో కావాలనుకుంటున్నారో ఆ సైజులోకి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. కాలీఫ్లవర్లో పురుగులు ఉండే అవకాశం ఎక్కువ.
5. కాబట్టి ఒక గిన్నెలో నీళ్లు వేసి పసుపు, ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కలను వేసి స్టవ్ మీద పెట్టాలి.
6. పది నిమిషాలు పాటు మరిగించి కాలీఫ్లవర్ ముక్కలను వడకట్టి తీసి పక్కన పెట్టుకోవాలి.
7. వాటిని గాలికే ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కప్పు నూనె వేయాలి.
8. అందులో కాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా వేయించుకోవాలి.
9. పైన మూత పెట్టకుండా వేయించాలి. అవి రంగు మారేవరకు వేయించుకోవాలి.
10. అవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి.
11. ఇప్పుడు అందులో కారం, ఉప్పు, మెంతి పిండి, ఆవ పిండి వేసి బాగా కలుపుకోవాలి.
12. ఈ మొత్తం మిశ్రమం చల్లారే దాకా అలా ఉంచాలి.
13. ఇది బాగా చల్లారాక రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి.
14. మీకు వెల్లుల్లి కావాలనుకుంటే వేసుకోవచ్చు.
15. లేదా ఇలానే వదిలేయొచ్చు. అంతే టేస్టీ కాలీఫ్లవర్ పికెల్ రెడీ అయినట్టే.
16. దీన్ని గాలి చొరబడని కంటైనర్లలో వేసి ఉంచితే 6 నెలల పాటు తాజాగా ఉంటుంది. రుచి కూడా అదిరిపోతుంది.
17. ఒక్కసారి చేసుకుని చూడండి. మీకు ఈ కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి కచ్చితంగా నచ్చుతుంది.
Also Read : నాన్ వెజ్ ప్రియులకు నచ్చేలా గోంగూర ఎండురొయ్యల కూర రెసిపీ, స్పైసీగా అదిరిపోతుంది
కాలిఫ్లవర్ ఆరోగ్యకరమైన ఆహారాలలో భాగమే. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గేవారికి కాలీఫ్లవర్ ఉత్తమ ఎంపిక అని చెప్పుకోవాలి. కాలీఫ్లవర్ లోని ఫైబర్ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కాలీఫ్లవర్ ను తరచూ తినడం వల్ల ఉపయోగం ఉంటుంది. కాలీఫ్లవర్ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో మెదడు, కాలేయం వంటి వాటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కాలీఫ్లవర్లోని పోషకాలు ముందుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా కాలీఫ్లవర్ అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కాలీఫ్లవర్ ను అప్పుడప్పుడు తినేందుకు ప్రయత్నించండి. అయితే పురుగులు జాగ్రత్తగా ఏరుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పురుగులు శరీరంలో చేరితే చాలా ప్రమాదకరంగా మారుతాయి. కాబట్టి మరిగే నీళ్లలో కాలీఫ్లవర్ ముక్కలను వేసి కాసేపు ఉంచాకే తీసి వండుకోవాలి.