Cheiramenu chintachiguru curry: నాన్-వెజ్ లవర్స్‌కు చేపల కూర అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందులోనూ సరి కొత్త రుచులను టేస్ట్ చేయాలనుకునే వారు రకరకాల కాంబినేషన్లతో వంటలు ట్రై చేస్తుంటారు. చలికాలం లేదా చింతచిగురు సీజన్ వచ్చిందంటే చాలు, అందరి ఇళ్లలోనూ వినిపించే పేరు ‘చింతచిగురు. మరీ ముఖ్యంగా లేత చింత చిగురుతో ఏ చేపల కూర వండినా దాని రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. అందులోనూ ‘చీరమేను'(చిన్న రకం చేపలు)తో చింతచిగురు కలిపి వండితే ఆ మజానే వేరు. మరి ఈ ట్రెడిషనల్ రెసిపీని మన ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం.
చీరమేను చేపలు – అర కేజీ
లేత చింతచిగురు – 1 కప్పు
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి – 4 లేదా 5
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్
కారం – 2 స్పూన్లు (రుచికి సరిపడా)
పసుపు – అర స్పూన్
ధనియాల పొడి – 1 స్పూన్
మెంతులు, ఆవాలు – కొద్దిగా (పోపు కోసం)
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – తరుగు
1.మొదటగా తెచ్చుకున్న చీరమేను చేపలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల చేపల వాసన పోయి కూర చాలా రుచిగా వస్తుంది. కడిగిన చేపల్లో.. కొద్దిగా పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి తగినంత నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక కొద్దిగా మెంతులు, ఆవాలు వేసి చిటపటలానివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి చీలికలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించడం ముఖ్యం.
3.ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత.. వరకు కలపాలి. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న లేత చింత చిగురును అందులో.. వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. చింత చిగురు నూనెలో మగ్గినప్పుడు మంచి సువాసన వస్తుంది.ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
Also Read: వంకాయ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా చేయండి..రుచి అద్దిరిపోతుంది!
4. ఇప్పుడు కూరకు సరి పడా నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో.. శుభ్రం చేసి పెట్టుకున్న చీర మేను చేపలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి.చేపలు వేసిన తర్వాత గరిటెతో.. ఎక్కువగా తిప్పకూడదు, లేదంటే చేప ముక్కలు చిధ్రమైపోతాయి. గిన్నెను పట్టుకుని నెమ్మదిగా తిప్పాలి.
5. మూత పెట్టి మీడియం మంటపై నూనె పైకి తేలే వరకు కూరను ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. గుమగుమలాడే అద్భుతమైన ‘చీరమేను చింతచిగురు కర్రీ’ రెడీ!
పుల్లపుల్లగా..కారకారంగా ఉండే ఈ చీరమేను చింతచిగురు కర్రీ వేడి వేడి అన్నంలో తింటే.. ఆ రుచి మరువలేరు. పల్లెటూరి వంటకాల ఘుమఘుమలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఈ వీకెండ్‌లో మీ ఇంట్లో ఈ డిష్ తయారు చేసి టేస్ట్ చేయండి.