Hara Bhara Kebab Recipe: ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్‌లోనూ చలిగాలులు వీస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో సాయంత్రం వేళ వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపించడం సహజం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కరకరలాడే చిరుతిళ్ల కోసం చూస్తుంటారు. అయితే రోజూ తినే బజ్జీలు, పకోడీలకు బదులుగా ఈసారి కాస్త కొత్తగా, రుచితో పాటు పోషకాలు అందించే హరాభరా కబాబ్‌ను ప్రయత్నించండి.
పచ్చని పాలకూర, పచ్చి బఠానీలు, బంగాళాదుంపలతో తయారయ్యే ఈ కబాబ్ బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి ప్రతి ముక్కలోనూ మంచి రుచిని అందిస్తుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు స్నాక్‌గా వడ్డించడానికి, సాయంత్రం పిల్లలకు నచ్చేలా ఏదైనా ప్రత్యేకంగా చేసి పెట్టడానికి ఇది చక్కని ఎంపిక. రెస్టారెంట్‌లో తిన్న రుచిని ఇంట్లోనే సులభంగా ఆస్వాదించవచ్చు. మరి హరాభరా తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందామా..
పాలకూర – ఒక కట్ట (సన్నగా తరిగింది)
బఠానీలు – ఒక కప్పు (ఉడికించినవి)
బంగాళాదుంపలు – రెండు (ఉడికించి మెదిపినవి)
పచ్చిమిర్చి – నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
Also Read: ఐస్‌క్రీమ్‌కు బదులుగా ఈ కొరియన్ డెజర్ట్ ట్రై చేయండి.. టేస్ట్ అమోఘం!
జీలకర్ర పొడి – అర స్పూన్
గరం మసాలా – అర స్పూన్
ఆమ్‍చూర్ పొడి – అర స్పూన్
శనగపిండి – రెండు స్పూన్లు
జీడిపప్పులు – పది (అలంకరణ కోసం)
నూనె – సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
ముందుగా బంగాళాదుంపలను ఉడికించి, పొట్టు తీసి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. పచ్చి బఠానీలను కూడా మెత్తగా ఉడికించాలి. పాలకూరను శుభ్రంగా కడిగి వేడి నీటిలో రెండు నిమిషాలు ఉంచి తీసేయాలి. చల్లారిన తర్వాత నీటిని పూర్తిగా పిండి, పాలకూరను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్‌లో పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, అల్లం వేసి మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో మెదిపిన బంగాళాదుంపలు, బఠానీల మిశ్రమం, తరిగిన పాలకూర వేసి బాగా కలపాలి. ఇందులో జీలకర్ర పొడి, గరం మసాలా, ఆమ్‌చూర్ పొడి, నిమ్మరసం, ఉప్పు, శనగపిండి వేసి మరోసారి కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని అరచేతితో గుండ్రంగా లేదా టిక్కీల ఆకారంలో చేసుకోవాలి. వీటిని బ్రెడ్ పొడిలో దొర్లిస్తే బయట పొర కాస్త క్రిస్పీగా వస్తుంది.
ఇప్పుడు పెనంలో నూనె వేడి చేసి కబాబ్‌లను వేసి మీడియం మంటపై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. నూనె తక్కువగా వాడాలనుకుంటే పెనంపై కొద్దిగా నూనె వేసి కూడా కాల్చుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడే పుదీనా చట్నీ లేదా టమోటా సాస్‌తో వడ్డిస్తే హరాభరా కబాబ్ రుచి అద్భుతంగా ఉంటుంది.
Also Read: కచ్చితమైన కొలతలతో మటన్ కచ్చి బిర్యానీ.. నోట్లో పెట్టగానే ముక్క వెన్నలా కరిగిపోద్ది!