Graduate Voters: గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఓటరు నమోదులో గ్రాడ్యుయేట్లు చూపుతున్న నిర్లక్ష్యం అధికారులకూ ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. ఎన్నికల కొరకు రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నమోదు వేగం పుంజుకోవడం లేదు. నవంబరు 6 తేదీన ఎన్ రోల్ మెంట్ గడువు ముగుస్తున్నప్పటికీ, ఇంకా మందకొడిగానే ప్రాసెస్ జరగడం గమనార్హం. ఇప్పటి వరకు నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల పరిధిలో కేవలం దాదాపు 42 శాతం నమోదు మాత్రమే పూర్తయినట్లు అధికారులు తెలిపారు.అక్టోబరు 21 తేదీ వరకు రెండు సెగ్మెంట్ల పరిధిలో కేవలం 4.36 లక్షల ఫారం–18లు మాత్రమే వచ్చినట్లు సమాచారం.
2021లో 10.31 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటికీ ఈ సంఖ్యను రీచ్ కాలేదు. పైగా ప్రతీ ఏడాది గ్రాడ్యుయేట్స్ పెరుగుతూనే ఉంటారు. కానీ ఎన్ రోల్ మెంట్ డేటా పరిశీలిస్తే వెరీ వీక్ కనిపిస్తుంది. ఎడ్యుకేటర్స్, సమాజంలో చైతన్యవంతమైన వర్గంగా భావించే గ్రాడ్యుయేట్లలో ఈ స్థాయిలో అలసత్వం కనిపించడం గమనార్హం. ఎన్నికల అధికారులు స్పెషల్ డ్రైవ్‌లు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, అవి కేవలం పరిపాలనా పరమైన ప్రక్రియగానే మిగిలిపోతున్నాయి. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్షేత్రస్థాయి యంత్రాంగం చూపిస్తున్న మొక్కుబడి వైఖరి కూడా నమోదు మందగించడానికి ఒక కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: ఆదోని మున్సిపల్ పోరులో ఊహించని ట్విస్ట్.. తిరగబడిన జనసేన నాయకులు!
అభ్యర్థుల డీలే.. అడపా దడపా పార్టీల ప్రచారం
సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులే ఓటర్ల నమోదు బాధ్యతను భుజాన వేసుకుంటారు.కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అధికార కాంగ్రెస్ తమ అభ్యర్ధులను ప్రకటించినప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్ వంటి ప్రధాన పార్టీలు ఇంకా అనౌన్స్ చేయలేదు. అభ్యర్థుల స్పష్టత లేకపోవడంతో పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు,కార్యకర్తలు కూడా నమోదు ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు. అక్కడక్కడా అడపా దడపా మాత్రమే ఎన్ రోల్ మెంట్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.మరోవైపు మహిళా ఓటర్ల నమోదు మరింత తక్కువగా ఉన్నది. ఉన్నత చదువులు పూర్తి చేసిన మహిళా పట్టభద్రులు చాలామంది ఉద్యోగాలు, గృహిణి బాధ్యతల్లో బిజీగా ఉండటం, సర్టిఫికెట్లు సమర్పించడంలో ఇబ్బందుల వల్ల నమోదుకు ముందుకు రావడం లేదు.మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం కూడా ఉన్నది. 2021లో 35 శాతం మంది మహిళా ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఈ దఫా ఆ సంఖ్యను పెంచాలని ఈసీ కూడా ప్రయత్నిస్తున్న ది.
మరోవైపు ఓటరు నమోదు చేసుకోవాలనుకుంటున్న గ్రాడ్యుయేట్లను సాంకేతిక సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సమర్పించే సమయంలో వెబ్‌సైట్ నెమ్మదించడం,ఓటీపీలు రాకపోవడం,సర్టిఫికెట్ల అప్‌లోడ్‌లో లోపాలు రావడం వంటి సమస్యలుఎదురవుతున్నాయి.అంతేగాక డిగ్రీ ప్రోవిజనల్, ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అటెస్టేషన్ వంటి నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో కొందరు దరఖాస్తు మధ్యలోనే వదిలేస్తున్నారు.యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు జారీ చేసిన డిగ్రీ సర్టిఫికెట్ల పై కూడా గెజిటెడ్ అధికారి ధృవీకరణ తప్పనిసరి చేయడం వల్ల దరఖాస్తుదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గెజిటెడ్ అధికారులను సంప్రదించడం, ధృవీకరణ పొందడం కోసం సమయం వెచ్చించాల్సి రావడంతో నమోదు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది.
Also read: పెద్ద హీరోల సినిమాలే కావాలా? చిన్న సినిమాల సంగతేంటి?ధీరజ్ కామెంట్స్ వైరల్!