Poha Pakoda: ఇంటికి బంధువులు వచ్చినప్పుడు తక్కువ సమయంలోనే అందరూ ఇష్టంగా తినేలా ఏదైనా స్నాక్ చేసి పెట్టాలనుకుంటున్నారా? అయితే అటుకులతో కరకరలాడే పకోడీలు చేసి చూడండి. ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో చిటికెలో తయారు చేసుకునే ఈ పకోడీలు రుచిలో అదుర్స్ అనిపిస్తాయి. బయట బంగారు రంగులో క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ స్నాక్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు.
ముఖ్యంగా, అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు హడావుడి పడకుండా తక్కువ ఖర్చుతోనే ఈ రుచికరమైన చిరుతిండిని సిద్ధం చేసుకోవచ్చు. వేడివేడి టీతో పాటు ఈ పకోడీలను వడ్డిస్తే ప్లేట్ ఖాళీ కావాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ అటుకుల పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా..
అటుకులు – ఒక కప్పు
శనగపిండి – అర కప్పు
బియ్యప్పిండి – పావు కప్పు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – 3
అల్లం – చిన్న ముక్క
కరివేపాకు – రెండు రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
జీలకర్ర – అర టీస్పూన్
కారం – అర టీస్పూన్
ఉప్పు – తగినంత
నీళ్లు – తగినన్ని
నూనె – వేయించడానికి సరిపడా
అటుకులను ఒక గిన్నెలో తీసుకుని నీటితో కడిగి, వెంటనే నీటిని వడకట్టాలి. అటుకులు మెత్తబడే వరకు 5 నిమిషాలు పక్కన పెట్టాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఒక పెద్ద గిన్నెలో నానబెట్టిన అటుకులు, శనగపిండి, బియ్యప్పిండి వేసుకోవాలి. ఇందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. మిశ్రమం మరీ పలుచగా కాకుండా పకోడీలు వేసుకోవడానికి వీలుగా ఉండాలి.
ఇప్పుడు బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పిండిని కొద్దికొద్దిగా చేత్తో తీసుకుని చిన్న చిన్న పకోడీలుగా నూనెలో వేయాలి. మంటను మీడియంగా ఉంచి పకోడీలను మధ్యమధ్యలో తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అవి చక్కగా కరకరలాడుతూ వేగిన తర్వాత నూనెలో నుంచి తీసి టిష్యూ పేపర్‌పై వేయాలి.
అంతే.. వేడివేడి అటుకుల పకోడీ రెడీ అయినట్టే. వీటిని టమాటా సాస్ లేదా పుదీనా చట్నీతో కలిపి తింటే రుచి మరింత బాగుంటుంది. పకోడీలు మరింత క్రిస్పీగా రావాలంటే పిండిలో బియ్యప్పిండి తప్పకుండా కలపాలి. సాయంత్రం వేళ వేడి వేడి టీలోకి ఈ అటుకుల పకోడీలు బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.