Vegetable Cutlet: డైట్ పేరుతో ఉడికించిన కూరగాయలే తిని బోర్ కొడుతోందా? ఇంట్లో క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలు ఉన్నా తినడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదా? అయితే వాటితో ఒకసారి ఈ క్రిస్పీ వెజిటబుల్ కట్లెట్స్ తయారుచేసి చూడండి. ఉడికించిన కూరగాయలకు బంగాళాదుంపల మెత్తదనం, మసాలాల ఘాటు, బ్రెడ్ క్రంబ్స్ క్రంచీనెస్ తోడైతే రుచే మారిపోతుంది. బయట బంగారు రంగులో కరకరలాడుతూ.. లోపల మెత్తగా ఉండే ఈ కట్లెట్స్‌ను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. బేకరీల్లో దొరికే కట్లెట్స్‌కు ఏమాత్రం తీసిపోని ఈ టేస్టీ స్నాక్‌ను ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
బంగాళాదుంపలు – 2 (ఉడికించి మెదిపినవి)
క్యారెట్ తురుము – అర కప్పు
బీన్స్ – అర కప్పు
పచ్చిబఠానీలు – పావు కప్పు
స్వీట్ కార్న్ – పావు కప్పు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 2
Also Read: కర్ణాటక ఫేమస్ బిసిబెళె బాత్.. ఒక్కసారి తింటే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!
అల్లం తురుము – 1 టీస్పూన్
కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు
కారం – అర టీస్పూన్
జీలకర్ర పొడి – అర టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
బ్రెడ్ క్రంబ్స్ – 3 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
నూనె – వేయించడానికి
క్యారెట్, బీన్స్, పచ్చిబఠానీలు, స్వీట్ కార్న్‌ను ఉడికించి నీళ్లు పూర్తిగా వంపేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మెదిపిన బంగాళాదుంపలు, ఉడికించిన కూరగాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, బ్రెడ్ క్రంబ్స్ వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని కట్లెట్స్ ఆకారంలో ఒత్తుకోవాలి. మరో గిన్నెలో కార్న్ ఫ్లోర్, కొద్దిగా నీళ్లు కలిపి పలుచని మిశ్రమం తయారుచేయాలి. కట్లెట్స్‌ను అందులో ముంచి బ్రెడ్ క్రంబ్స్‌లో అద్దుకోవాలి.
ఇప్పుడు పాన్‌లో నూనె వేడి చేసి మీడియం మంటపై కట్లెట్స్‌ను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే.. వేడివేడి క్రిస్పీ వెజిటబుల్ కట్లెట్స్ రెడీ. వీటిని టమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి.
Also Read: రెడ్ సాస్ పాస్తాకు అసలైన ఇటాలియన్ రుచి రావాలంటే ఇలా చేయండి!