Tangy Red Sauce Pasta: పాస్తా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. ముఖ్యంగా టమోటాల గుజ్జుతో తయారుచేసే రెడ్ సాస్ పాస్తాకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇందులో ఉండే టమోటాల పుల్లటి రుచి, వెల్లుల్లి ఘాటు, చిల్లీ ఫ్లేక్స్ కారం, ఇటాలియన్ మసాలాల సువాసన కలిస్తే నోట్లో నీళ్లూరిపోతాయి. అయితే ఇంట్లో పాస్తా తయారుచేసినప్పుడు ఒక్కోసారి సాస్ పలుచగా ఉండటం, మరీ పుల్లగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే రెస్టారెంట్లలో దొరికే రుచిని ఇంట్లోనే సులభంగా పొందవచ్చు. తక్కువ సమయంలో తయారయ్యే ఈ ట్యాంగీ రెడ్ సాస్ పాస్తాను సాయంత్రం స్నాక్‌గా లేదా పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా పెట్టవచ్చు.
పాస్తా – 2 కప్పులు
టమోటా ప్యూరీ – 2 కప్పులు
ఉల్లిపాయ – ఒకటి
వెల్లుల్లి రెబ్బలు – 4 నుంచి 5
ఆలివ్ ఆయిల్ – 2 టేబుల్ స్పూన్లు
రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్
ఎండు ఒరేగానో – ఒక టీ స్పూన్
చక్కెర – ఒక టీ స్పూన్
టమోటా కెచప్ – 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – తగినంత
ఉప్పు – తగినంత
తాజా తులసి ఆకులు – కొద్దిగా
తురిమిన చీజ్ – తగినంత
Also Read: ఐఫోన్ డేటా ఆండ్రాయిడ్‌లోకి మార్చడం ఇంత ఈజీనా? కేబుల్‌తో పనిలేకుండా సేఫ్‌గా ట్రాన్స్‌ఫర్ చేయండిలా!
మొదట ఒక పెద్ద గిన్నెలో సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి పాస్తా జతచేయాలి. పాస్తా మెత్తగా ఉడికే వరకు కాకుండా కొద్దిగా గట్టిదనం ఉండేలా ఉడికించాలి. అనంతరం నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేయాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.
తర్వాత అందులో టమోటా ప్యూరీ వేసి బాగా కలపాలి. మీడియం మంటపై సుమారు 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. టమోటా పచ్చి వాసన పోయి మిశ్రమం చిక్కగా మారే వరకు ఉడికించడం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ఒరేగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలపాలి.
సాస్ రుచిని మరింత పెంచడానికి చక్కెర, టమోటా కెచప్ జతచేయాలి. చక్కెర టమోటాల్లోని అధిక పులుపును తగ్గిస్తే.. కెచప్ మంచి ట్యాంగీ రుచిని అందిస్తుంది. వీటన్నింటినీ బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.
చివరగా ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాను ఈ సాస్‌లో వేసి సాస్ ప్రతి పాస్తా ముక్కకు పట్టేలా బాగా కలపాలి. పైన తాజా తులసి ఆకులు, తురిమిన చీజ్ చల్లుకోవాలి. ఇక ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ ట్యాంగీ రెడ్ సాస్ పాస్తా సిద్ధం అయినట్టే. వేడివేడిగా సర్వ్ చేస్తే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.
Also Read: రూ.20 వేల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఇవే!