Mosquito Bites: మనిషిని ఎక్కువ ఇబ్బందులకు గురి చేసే కీటకాల్లో దోమలు ఫస్ట్ ప్లేసులో ఉంటాయి. ఇవి వ్యక్తులను కుట్టి రక్తం తాగడమే కాకుండా.. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడేస్తుంటాయి. అయితే సాధారణంగా దోమలు కొందరిని ఎక్కువగా కుడితే.. మరికొందరిని మాత్రం పెద్దగా పట్టించుకోవన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. మరీ ముఖ్యంగా A, B, O గ్రూప్ రక్తం ఉన్న వారినే అవి టార్గెట్ చేస్తుంటాయని చాలా మంది నమ్ముతుంటారు. అయితే బ్లడ్ గ్రూప్ కు మించి దోమలు ఒక వ్యక్తిని కుట్టడానికి గల వింత కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
జర్నల్ ఆఫ్ మెడికల్ ఎంటమాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ‘ఏడిస్ అల్బోపిక్టస్’ (టైగర్ దోమ) రకానికి చెందిన దోమలు ‘ఏ’ గ్రూప్ వారితో పోలిస్తే ‘ఓ’ గ్రూప్ ఉన్నవారిపై రెట్టింపు సార్లు కుట్టాయట. ఈ స్టడీలో ‘బీ’ గ్రూప్ వారు న్యూట్రల్ ప్లేసులో ఉన్రునారు. అయితే దోమలు కుట్టడంలో బ్లడ్ గ్రూప్ పాత్ర కొద్దిమేర ఉన్నప్పటికీ అదే నూటి నూరు శాతం కారణం కాదని పరిశోధనలు చెబుతున్నాయి. మనిషి శరీరం నుంచి వాటికి వెళ్లే సంకేతాలే దోమలు కుట్టేందుకు ఎక్కువగా కారణమవుతున్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మన చర్మంపై ఉండే లక్షలాది బ్యాక్టీరియాలు రకరకాల వాయు సమ్మేళనాలను విడుదల చేస్తాయి. నెదర్లాండ్స్ పరిశోధన ప్రకారం.. చర్మంపై వైవిధ్యమైన బ్యాక్టీరియా ఉన్నవారిని దోమలు తక్కువగా కుడతాయట. కొన్ని రకాల బ్యాక్టీరియాలు మాత్రం దోమలను ఆకర్షిస్తాయట. అందుకే ఒకే కుటుంబానికి చెందిన వారిని దోమలు ఎక్కువగా కుట్టడానికి జన్యువులతో పాటు ఈ సూక్ష్మజీవుల సమూహాలు కూడా ఒక కారణం కావచ్చని నిపుణులు అంటున్నారు.
Also Read: భూమికి కవల గ్రహం.. శుక్రుడిపై ఒక రోజు గడిపారో.. మీకు కనిపించే వింతలు ఇవే!
మరోవైపు మద్యం తాగిన వారిని సైతం దోమలు ఎక్కువగా కుడుతున్నాయని పరిశోధనల్లో తేలింది. మద్యం తాగటం వల్లే శరీర ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పులు, చెమటలో ఇథనాల్ కలవడం వంటి కారణాల వల్ల దోమలు ఆకర్షితమవుతున్నట్లు వెల్లడైంది. అటు సాధారణ మహిళలతో పోలిస్తే గర్భిణులను కూడా దోమలు అధికంగా కుడుతున్నట్లు కూడా పరిశోధకులు తెలియజేశారు. అలాగే నలుపు, నేవీ బ్లూ, ఎరుపు వంటి ముదురు రంగు దుస్తులు వేసుకుంటే దోమలకు సులభంగా టార్గెట్ గా మారుతారని స్పష్టం చేస్తున్నారు.
Also Read: అప్పుడు గాజులు.. ఇప్పుడు గజ్జెలు.. ప్రతిసారీ అదే పాట ఫార్ములానా?