Soda Drinks: చాలామందికి సోడాలు తాగే అలవాటు ఉంటుంది. కొంత మంది బయట నేరుగా తాగితే, మరి కొందరు ఆల్కహాల్ లో కలుపుకొని తాగుతారు. ఎలా తాగినా కూడా సోడాలు ఆరోగ్యానికి కీడు చేస్తాయని చెబుతోంది కొత్త పరిశోధన. జనరల్ ఆఫ్ స్ట్రోక్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం సోడాను తాగడం వల్ల భవిష్యత్తులో స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను వేగంగా పెంచేస్తుంది. రక్తనాళాల్లో ఇన్ష్లమేషన్ ను ఏర్పడేలా చేస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు పెరిగిపోతాయి. కాబట్టి మీకు సోడా తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయడం చాలా మంచిది. సాధారణ ద్రవాలతో పోలిస్తే సోడా తాగడం వల్ల స్టాక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 22 శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు అధ్యయనం చెబుతోంది.
కేవలం సోడానే కాదు చక్కెర కలిపిన పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు, కానీ పండ్లలో మాత్రం ఫైబర్ ఉంటుంది. అందుకే పండునే నేరుగా తినమని చెబుతారు. దీని వల్ల శరీరానికి అత్యవసరమైన ఫైబర్ శరీరంలో చేరుతుంది. పండ్లను జ్యూస్‌గా మార్చడం వల్ల ఫైబర్ రహితంగా మారుతుంది. కాబట్టి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పండ్ల రసాలకు బదులు పండ్లనే తినాలి. అలాగే పండ్ల రసాలు తక్షణమే శరీరంలో చక్కెరను విడుదల అయ్యేలా చేస్తాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీనివల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి.
పండ్ల రసాలు, సోడాల కన్నా ప్రతిరోజూ ఏడెనిమిది గ్లాసుల నీటిని తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. సోడా డ్రింకులు, ఫ్రూట్ డ్రింక్స్ వంటివి కాకుండా నీళ్లు… స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గుతుంది తగ్గేలా చేస్తాయి.
స్ట్రోక్ అంటే ఏమిటి?
మెదడుకు వచ్చే పెద్ద సమస్య స్ట్రోక్. మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు మెదడు కణాలు మరణిస్తాయి. ఆ సమయంలో అక్కడ స్ట్రోక్ వస్తుంది. దీన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మెదడులోని రక్తనాళాలు చిట్లి అక్కడ అంతర్గత రక్తస్రావం జరగడం వల్ల కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్ట్రోక్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఒక అధ్యయనం కోసం 27 దేశాలకు చెందిన 27 వేల మందిని ఎంపిక చేశారు. వారిలో 13,500 మంది స్ట్రోక్ కు మొదటిసారి గురైన వారే. దీనిబట్టి బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.
బ్రెయిన్ స్ట్రోక్ కు గుండె సమస్యలకు కూడా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కెర నిండిన పానీయాలకు దూరంగా ఉండాలి. ఆకుపచ్చగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తినేందుకు ప్రయత్నించాలి. అలాగే బ్రోకోలి, పాలకూర కచ్చితంగా ఆహారంలా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే వీటిలో విటమిన్ కె, బీటా కెరాటిన్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన పోషకాలను అందిస్తాయి. ఇవన్నీ కూడా మొక్కల ఆధారిత ఆహారాలు. కాబట్టి మెదడుకు ఇవన్నీ ఎంతో మేలు చేస్తాయి.
Also Read: బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి ప్రతిరోజూ తినమని చెబుతున్న పోషకాహార నిపుణులు, ఇలా తింటే ఏమవుతుంది?
ఎవరైతే హైబీపీ, డయాబెటిస్ వంటి రోగాల బారిన పడతారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సిగరెట్ తాగడం మద్యం తాగే అలవాటు ఉన్నవారిలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఒత్తిడికి తీవ్రంగా గురి అయ్యే వారిలో కూడా ఈ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువే. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినా, సరైన వ్యాయామం లేకపోయినా, ఊబకాయంతో బాధపడుతున్నా బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కాబట్టి స్ట్రోక్ బారిన పడకుండా ఉండాలంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.