నవ్వుతూ ఉండే ముఖాన్ని చూస్తే అలా చూడాలనిపిస్తుంది. ఎప్పుడూ చిర్రుబుర్రులాడే వారిని చూస్తే దూరంగా వెళ్లిపోవాలనిపిస్తుంది. నవ్వు నాలుగు విధాలా కాదు నలభై విధాల మేలే చేస్తుంది. మనిషి జీవితంలో నవ్వు ఆనందాన్ని పెంచే ఒక అద్భుతమైన పని. అయితే ఆ నవ్వు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు లైంగిక పటుత్వాన్ని కూడా అందిస్తుందని చెబుతున్నాయి కొత్త అధ్యయనాలు.
మగవారు నవ్వితే రెచ్చిపోతారు
నవ్వినప్పుడు మీ శరీరంలో ఎండార్ఫిన్లు, డోపమైన్లు వంటి సంతోష హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి హార్మోను ఉత్పత్తిని తగ్గిస్తాయి. శరీరానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఎప్పుడైతే ఒత్తిడి తగ్గుతుందో టెస్టోస్టిరాన్ సహజంగానే పెరిగే అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్ అన్నది పురుషత్వానికి ముఖ్యమైన హార్మోన్. లైంగిక ప్రక్రియలో కూడా టెస్టోస్టోరాన్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు మెరుగుపరడం వల్ల శక్తి ఆత్మవిశ్వాసం వస్తుంది. బెడ్ రూమ్ లో ఆ వ్యక్తి లైంగిక ప్రక్రియను పరిపూర్ణంగా ఆస్వాదించే అవకాశం వస్తుంది. కాబట్టి మగవారు నవ్వుతూ ఉండేందుకు ప్రయత్నించండి.
నవ్వు… జంటల మధ్య ప్రేమను పెంచుతుంది. తద్వారా లైంగిక ప్రక్రియకు కూడా మార్గాలు వేస్తుంది. భార్యాభర్తల మధ్య సానుభూతి, సన్నిహిత బంధాన్ని బలోపేతం చేయడానికి నవ్వు ఎంతో ఉపయోగపడుతుంది. భాగస్వాములు కలిసి నవ్వుకుంటున్నారంటే వారి మధ్య అవగాహన, సంతోషం పెరుగుతాయి. ఆ సమయంలో భావోద్వేగ సామీప్యత ఏర్పడుతుంది. ఆ సన్నిహిత క్షణాల్లో వారికి లైంగిక కోరికలు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నవ్వు జంటల మధ్య ఎంతో అవసరమైనది.
నవ్వడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. మీరు నవ్వినప్పుడు మీ శరీరంలోని ప్రతి అవయవానికి రక్తప్రసరణ జోరుగా జరుగుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. మంచి రక్తప్రసరణ శరీర శక్తిని పెంచి సన్నిహిత క్షణాల్లో శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాదు శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించేలా ప్రోత్సహిస్తుంది. జంటల మధ్య సంతృప్తి పెరిగేందుకు మద్దతు ఇస్తుంది.
కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా నవ్వు ఎంతో ముఖ్యమైనది. నవ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జంటల మధ్య భావోద్వేగ సంతృప్తి పెరుగుతుంది. దీనివల్ల వారిద్దరూ మానసికంగా దగ్గరవుతారు. మానసిక సమతుల్యత ఏర్పడుతుంది. ఇది మీ జీవితంలో ఎంతో ప్రశాంతతనీ ఇస్తుంది.
నవ్వు మాత్రమే సరిపోదు
అయితే నవ్వడం వల్ల మాత్రమే సన్నిహిత క్షణాల్లో లైంగిక శక్తి పెరుగుతుందని చెప్పలేము. కానీ ఇది కూడా ఒక కారకంగా మాత్రం మారుతుంది. సమతలమైన ఆహారం తీసుకోవడం, తరచూ వ్యాయామం చేయడం వంటివి కూడా మీ లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి. టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంటే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లైంగిక ప్రక్రియలో మగవారిలో టెస్టోస్టోరాన్ హార్మోన్ ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
నవ్వు ఆరోగ్యానికే కాదు భార్యాభర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నవ్వుతూ జీవించడం నేర్చుకుంటే ఏ సమస్యనైనా మీరు ఇట్టే దాటుకుంటూ వెళ్లిపోతారు.