Car Maintenance Tips: కారు కొనుగోలు చేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో కార్లకు ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. పార్కింగ్ చేసిన కార్ల బోనెట్ లోకి చేరే ఎలుకలు వైరింగ్, రబ్బర్ పైపులు, ప్లాస్టిక్ భాగాలను కొరికేస్తుంటాయి. దీనివల్ల కారు స్టార్ట్ కాకపోవడం, ఇంజిన్ వార్నింగ్ లైట్లు వెలగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు వైరింగ్ మొత్తం మార్చాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఈ రిపేర్లకు వేల నుంచి లక్ష రూపాయలకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉంది. అయితే, కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. అవేంటంటే..
కారు ప్రయాణం పూర్తయిన తర్వాత ఇంజిన్ కొంతసేపు వెచ్చగా ఉంటుంది. చల్లని వాతావరణంలో ఈ వేడి ఎలుకలకు బాగా నచ్చుతుంది. అంతేకాకుండా వైరింగ్‌పై ఉండే రబ్బర్, ప్లాస్టిక్ పూతలను ఎలుకలు కొరుకుతుంటాయి. ఎలుకలకు ఇలా నమలడం వాటికి ఓ అలవాటు. ఒకసారి బోనెట్ లో సురక్షితమైన ప్రదేశం దొరికితే అక్కడే గూడు కట్టుకుని ఉండిపోతాయి.
మార్కెట్‌లో లభించే ర్యాట్ రిపెల్లెంట్ స్ప్రేలు ఎలుకలను దూరంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. వీటిని కారు వైరింగ్, రబ్బర్ హోస్‌లు, ప్లాస్టిక్ పైపులపై స్ప్రే చేయవచ్చు. అయితే, ఇంజిన్ పూర్తిగా చల్లబడిన తర్వాతే స్ప్రే చేయాలి. వర్షం, నీటి వల్ల ప్రభావం ఈ స్ప్రే ఎఫెక్ట్ తగ్గితే మళ్లీ ఉపయోగించాలి.
అల్ట్రాసోనిక్ రిపెల్లెంట్లు స్పెషల్ సౌండ్ ను విడుదల చేసి ఎలుకలను ఇబ్బంది పెడతాయి. కొన్ని పరికరాల్లో LED లైట్లు కూడా ఉంటాయి. ఇవి ఎలుకలు ఇంజిన్ భాగంలోకి రాకుండా నిరోధించేందుకు ఉపయోగపడవచ్చు. అయితే, వీటి ప్రభావం అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండదు. సో, వీటిపైనే పూర్తిగా ఆధారపడకూడదు.
కారు ఏసీ ఎయిర్ ఇన్‌టేక్, ఇతర ప్రవేశ మార్గాల దగ్గర స్టెయిన్‌లెస్ స్టీల్ మెష్ ఏర్పాటు చేయడం మంచిది. దీని వల్ల ఎలుకలు లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. అయితే, కారు గాలి ప్రవాహానికి, ఇంజిన్ పనితీరుకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు చేయించాలి.
మింట్ ఆయిల్ స్మెల్ ఎలుకలకు నచ్చదని చాలామంది ఉపయోగిస్తుంటారు. కాటన్ మీద కొద్దిగా పుదీనా నూనె వేసి ఇంజిన్ లో ఉంచాలి. అయితే, ఇవి తాత్కాలిక పద్ధతులు మాత్రమే. ఇంజిన్ వేడి భాగాలు, కదిలే భాగాలకు దగ్గరగా వీటిని ఉంచకూడదు. నాఫ్తలీన్ టాబ్లెట్స్ మాత్రం బోనెట్‌లో వేయడం మంచిది కాదు.
కారులో బిస్కెట్ ముక్కలు, ఫుడ్, చెత్త ఉంచకూడదు. చెత్త కుప్పలు, డ్రైనేజీ కాలువల పక్కన పార్కింగ్ చేయకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు వెలుతురు ఉండే శుభ్రమైన ప్రదేశాల్లో కారును పార్క్ చేయాలి. అలాగే వారానికి ఒకసారి బోనెట్ ఓపెన్ చేసి చూడాలి.
Read Also: లాంగ్ డ్రైవ్‌ల కోసం బెస్ట్ 5 డీజిల్ SUVలు.. వీటి పవర్ చూస్తే ఆశ్చర్యపోతారు!