గోధుమ రవ్వ వంటకాలు అధికంగానే ఉన్నాయి. ఎక్కువగా దీంతో ఉప్మాను చేసుకునేందుకు ఇష్టపడతారు. అయితే గోధుమ రవ్వతో తీపి పాయసం చేసుకోవచ్చు. మీకు తీపి తినాలనిపించినప్పుడు ఇలా గోధుమ రవ్వ పాయసం చేసుకుంటే సులభంగా తయారైపోతుంది. ఎక్కువసేపు పొట్ట నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనిలో పంచదారకు బదులు బెల్లాన్ని వాడడం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. గోధుమ రవ్వ పాయసంలో పంచదార వేస్తే మాత్రం ఆరోగ్యానికి హానికరమే. కాబట్టి బెల్లం వేసి గోధుమ రవ్వ పాయసాన్ని సులువుగా ఎలా చేయాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
గోధుమ రవ్వ – ఒక కప్పు
పాలు – ఒకటిన్నర కప్పు
బెల్లం తురుము – అర కప్పు
నీళ్లు – ఒకటిన్నర కప్పు
జీడిపప్పులు – గుప్పెడు
బాదం – గుప్పెడు
కిస్ మిస్ – గుప్పెడు
గోధుమ రవ్వ పాయసం రెసిపీ
⦿ ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోండి.
⦿ అలాగే కుక్కర్లో ఒకటిన్నర కప్పు పాలు, ఒకటిన్నర కప్పు నీళ్లు వేసి బాగా కలపండి.
⦿ అందులోనే ఒక కప్పు గోధుమ రవ్వను వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టండి.
⦿ చిన్న మంట మీద ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించండి.
⦿ తర్వాత మూత తీసి మళ్లీ చిన్న మంట మీద ఉడికించండి.
⦿ దానిలో బెల్లం తురుమును వేసి బాగా కలపండి.
⦿ అది దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉండండి.
⦿ పావు కప్పు పాలను వేసి మళ్లీ కలపండి.
⦿ బాదం, జీడిపప్పు, అంజీర్ వంటి వాటిని చిన్న ముక్కలుగా కోసి అందులో వేసి కలుపుకోండి.
⦿ ఇది హల్వా లాగా లేదా పాయసం లాగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి.
⦿ అంతే గోధుమ రవ్వ పాయసం రెడీ అయినట్టే.
ఈ గోధుమ రవ్వ పాయసం కేవలం 20 నిమిషాల్లో సిద్ధమైపోతుంది. ఎవరైనా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు తీపి పదార్థం చేయాల్సి వస్తే ఇలా గోధుమ రవ్వ పాయసాన్ని చేయండి. తక్కువ సమయంలోనే తయారయ్యే టేస్టీ వంటకం ఇది. దీనిలో పంచదార వేసేవారు ఎక్కువమంది. పంచదార వేశారంటే మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకున్నట్.టు పంచదార ప్రాసెస్డ్ ఫుడ్. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదకరం. ఇక లేని వారికి ఆ రోగం బారిన పడేలా చేస్తుంది.
Also Read: ఉదయాన్నే ఈ రెడ్ షాట్ తాగితే.. ఆ సమస్యలన్నీ మాయం
అంతేకాదు పంచదార తినడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే శరీరంలో ఇన్ఫ్మేషన్ అధికంగా ఉంటుందో వారిలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కాబట్టి పాయసం కేవలం బెల్లంతో మాత్రమే చేయండి. బెల్లంలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఐరన్ ను కలిగి ఉంటుంది. కాబట్టి రక్తహీనత సమస్య కూడా రాకుండా ఉంటుంది. బెల్లంతో చేసిన ఈ పాయసం అన్ని రకాలుగా ఆరోగ్యకరమే. ఎందుకంటే దీనిలో పాలు కూడా ఉన్నాయి. పాలలో ఉండే క్యాల్షియం కూడా మన శరీరానికి అత్యవసరమైనది. గోధుమ రవ్వ, పాలు, జీడిపప్పులు, బాదం పప్పులు, బెల్లం ఇవన్నీ కూడా మనకు కావాల్సిన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. దీన్ని తినడం వల్ల మీకు పొట్ట కూడా నిండినట్టు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.