Dondakaya Fry: రుచిగా ఉండే వంటకాలు ఎవరికి మాత్రం నచ్చవు చెప్పండి. అందులోనూ ఆంధ్రా స్టైల్ వంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎంతో రుచికరమైన కూరగాయల్లో కూడా కొన్ని మన ఇంట్లో వారికి పెద్దగా నచ్చవు. అలాంటి వాటిల్లో దొండకాయ కూడా ఒకటి. ఈ దొండకాయతో సాంబార్, పులుసు, పచ్చడి ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. కానీ ఎప్పటికీ ఎక్కువ మందికి నచ్చే వంటకం మాత్రం దొండకాయ వేపుడు. మరి ఈ రుచికరమైన దొండకాయ వేపుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
దొండకాయ వేపుడుకు కావలసిన పదార్థాలు:
దొండకాయలు – పావు కేజీ
పల్లీలు – గుప్పెడు
ఉల్లిపాయ – ఒకటి (చిన్నది)
పసుపు – చిటికెడు
కారం – ఒకటిన్నర స్పూను (లేదా మీ రుచికి సరిపడా)
ఉప్పు – ఒకటిన్నర స్పూను (లేదా మీ రుచికి సరిపడా)
శనగపప్పు, మినపప్పు – ఒక్కో స్పూను
ఆవాలు, జీలకర్ర – ఒక్కో స్పూను
ఎండుమిర్చి – ఒకటి
కరివేపాకు – కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు – ఐదు
నూనె – సరిపడా
తయారీ విధానం:
1. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి సన్నగా.. పొడవుగా తరగాలి. సన్నగా తరిగితే త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా చిదిమి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక వేరుశనగ పప్పులు వేసి దోరగా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
3. అదే బాణలిలో మరికొద్దిగా నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
4. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి రంగు మారే వరకు వేయించుకోవాలి.
5. ఇప్పుడు తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి బాగా కలిపి, మూత పెట్టాలి. దొండకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి మగ్గడానికి సుమారు పది నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది.
6. దొండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి ఒక నిమిషం వేగనివ్వాలి.
7. చివరగా వేయించుకున్న వేరుశనగ పప్పులు వేసి కలిపి స్టవ్ కట్టేయాలి. అంతే ఆంధ్ర స్టైల్ దొండకాయ వేపుడు రెడీ.
Also Read: మాసాలా వడ బయట తిన్నట్లే క్రిస్పీగా రావాలంటే.. ఇలా ట్రై చేయండి
ఈ రుచికరమైన దొండకాయ వేపుడును అన్నం, చపాతీ లేదా రోటీతో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇందులో వేరుశనగ పప్పులు వేయడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా దీనిని ఇష్టపడతారు. ఈ వంటకాన్ని ఎవరైనా సులభంగా తయారు చేయవచ్చు. ఈ దొండకాయ వేపుడులో ఉపయోగించే వేరుశనగ పప్పులు కరకరలాడుతూ, కారం, ఉప్పుతో కలిసి సరికొత్త రుచిని ఇస్తాయి. ఈ వంటకాన్ని తయారు చేయడం చాలా తేలిక, దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. వేపుడును ఫ్రై పాన్ లో చేస్తే ఇంకా తక్కువ సమయంలో అవుతుంది. మీ ఇంట్లో వారికి ఇష్టమైన ఈ వేపుడును మీరు ఈ పద్ధతిలో తయారు చేసి పెట్టండి, కచ్చితంగా పొగడ్తలు అందుకుంటారు.