iPhone history: నేటి యువతకి ఫోన్ అంటేనే ఐఫోన్ అన్నట్టుగా మారిపోయింది. ఎందుకంటే ఐఫోన్ అనేది కేవలం మాట్లాడుకునే పరికరం కాదు, అది ఒక స్టేటస్ సింబల్, ఒక లైఫ్‌స్టైల్. టచ్ స్క్రీన్ ఫోన్లకు నాంది పలికింది ఐఫోన్ ద్వారానే. అద్భుతమైన డిజైన్, కెమెరా క్వాలిటీ, సెక్యూరిటీ, ప్రదర్శన అన్నీ కలిపి ఐఫోన్‌ను ప్రత్యేకం చేశాయి. ప్రతి కొత్త మోడల్ వస్తే ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారిపోతుంది. అందుకే యువత లో చాలా మంది ఫోన్ అంటే ఐఫోన్ అనే సమాధానం ఇస్తున్నారు. ప్రపంచాన్నే కాదు యువతను సైతం మార్చిన ఐఫోన్ కనిపెట్టింది ఎవరో తెలుసా? ఎప్పుడు మొదలైందో తెలుసా? అయితే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచానికి ఐఫోన్‌ను పరిచయం చేసింది.. స్టీవ్ జాబ్స్
స్టీవ్ జాబ్స్ మొదటిసారి 2007లో ప్రపంచానికి ఐఫోన్‌ను పరిచయం చేశారు. స్టీవ్ ఫిబ్రవరి 24, 1955న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. ఈయన ఆవిష్కరించిన ఐఫోన్ ఈ రోజున ప్రపంచంలోని దాదాపు ప్రతి యువకుడి కలల ఫోన్‌గా మారింది. అప్పటివరకు మనం వాడే ఫోన్లలో ఎక్కువగా కీప్యాడ్ ఉండేది. స్మార్ట్‌ఫోన్లు అంటే చాలా మందికి బ్లాక్‌బెర్రీ లేదా నోకియా గుర్తొచ్చేది. కానీ ఐఫోన్ వచ్చి ఆ ప్రపంచం మొత్తం మార్చేసింది. టచ్ స్క్రీన్‌తోనే పనిచేసే ఫోన్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మ్యూజిక్ వినడం, ఫోటోలు తీయడం, యాప్స్ వాడటం అన్నీ ఒకే పరికరంలో, ఆ సమయంలో ఇది విప్లవం కంటే తక్కువేమీ కాదు.
ఐఫోన్ కొత్త యుగం ఆరంభం
మొదటి ఐఫోన్ వచ్చినప్పుడు దానిలో కొన్ని పరిమితులు ఉన్నా, టెక్నాలజీ ప్రపంచం దానిని ఒక కొత్త యుగం ఆరంభంగా చూసింది. 2008లో ఐఫోన్ 3జి వచ్చింది. దాంతో హై స్పీడ్ ఇంటర్నెట్ ను ఐఫోన్‌లో వాడే అవకాశం కలిగింది. అదే ఏడాది ఆపిల్ యాప్ స్టోర్ ను కూడా ప్రారంభించింది. ఇది ఫోన్ వాడకాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక పరికరానికి లక్షల యాప్స్ రావచ్చని అప్పటివరకు ఎవ్వరూ ఊహించలేదు.
2009 నుంచి 3జిఎస్ స్టార్ట్
2009లో ఐఫోన్ 3జిఎస్ వచ్చింది. ఇది స్పీడ్ లో, పనితీరు లో చాలా మెరుగ్గా ఉండేది. 2010లో వచ్చిన ఐఫోన్ 4 తన సరికొత్త డిజైన్, రెటినా డిస్‌ప్లేతో ప్రజలను ఆకట్టుకుంది. 2011లో వచ్చిన ఐఫోన్ 4ఎస్ లో సిరి అనే వాయిస్ అసిస్టెంట్ ను పరిచయం చేశారు. అది కేవలం ఒక ఫీచర్ కాదు, భవిష్యత్తులో వాయిస్ టెక్ ఎంత ముఖ్యమవుతుందో చూపించింది.
Also Read: Crime News: పెళ్లి కావడం లేదని.. రైలు కింద పడి.. కామారెడ్డిలో దారుణ ఘటన
2014లో వచ్చిన ఐఫోన్ 6, 6 ప్లస్ పెద్ద స్క్రీన్ ట్రెండ్
తరువాతి సంవత్సరాల్లో యాపిల్ ప్రతి ఐఫోన్ మోడల్ తో ఒక కొత్త ప్రమాణాన్ని సెట్ చేసింది. 2012–13లో వచ్చిన ఐఫోన్ 5 సిరీస్ స్లిమ్ డిజైన్, ఫాస్ట్ ప్రాసెసర్ తో వినియోగదారుల మనసు దోచుకుంది. 2014లో వచ్చిన ఐఫోన్ 6, 6 ప్లస్ పెద్ద స్క్రీన్ ట్రెండ్ ను మొదలు పెట్టాయి. ఆ తర్వాత ఇతర కంపెనీలు కూడా అదే మార్గంలో నడవడం మొదలుపెట్టాయి.
2016లో విమర్శలు
2016లో వచ్చిన ఐఫో 7 కొత్త డిజైన్ తో పాటు మెరుగైన కెమెరాలతో వచ్చింది. ఇదే మోడల్ లో మొదటిసారి హెడ్‌ఫోన్ జాక్ తీసేశారు. ఆ సమయంలో చాలా విమర్శలు ఎదురైనా, తరువాత వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల ట్రెండ్ ప్రపంచమంతా ఫాలో అయింది.
2017లో వచ్చిన ఐఫోన్ ఎక్స్ బ్రాండ్ ఇమేజ్
2017లో వచ్చిన ఐఫోన్ ఎక్స్ ఒక మలుపు. ఇది పూర్తి స్క్రీన్ డిస్‌ప్లే, నాచ్ డిజైన్, అంటే మొబైల్ ఫోన్ స్క్రీన్ పైభాగంలో మధ్యలో ఉండే చిన్న కట్ అవుట్ లాంటిది. ఫేస్ ఐడి అనే కొత్త సెక్యూరిటీ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇది ఐఫోన్ చరిత్రలోనే కాకుండా, మొత్తం మొబైల్ పరిశ్రమలో ఒక పెద్ద మార్పు.
2019–21 ఐఫోన్ మరిన్ని అప్‌గ్రేడ్స్
తర్వాతి సంవత్సరాల్లో ఐఫోన్ మరిన్ని అప్‌గ్రేడ్స్ తెచ్చింది. 2019–21లో వచ్చిన ఐఫోన్ 11, 12, 13 సిరీస్ లు కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, 5జి సపోర్ట్ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి. ప్రత్యేకంగా ఐఫోన్ 12 తో 5జి యుగం మొదలైంది. 2022, 2023లో వచ్చిన ఐఫోన్ 14, 15 సిరీస్ లలో డైనమిక్ ఐలాండ్ అనే ఫీచర్ చాలా పాపులర్ అయింది. 2024, 2025లో ఐఫోన్ 16, 17 సిరీస్ లు కూడా సన్నని డిజైన్, ఏఐ ఆధారిత ఫీచర్లతో మరింత భవిష్యత్తు ఉపయోగపడేలా అనిపిస్తున్నాయి.
మూడు బిలియన్ ఐఫోన్
ఐఫోన్‌పై ఉన్న దీర్ఘకాలిక ప్రజాదరణను గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 2007 నుండి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు బిలియన్ యూనిట్లు విక్రయించబడి, కోట్లాది మంది వినియోగదారుల జీవితంలో భాగమయ్యాయి. అంటే 30 బిలియన్లల ఫోన్లు ప్రజల చేతుల్లోకి వెళ్లాయి. ప్రతి సంవత్సరం సగటున 200 నుంచి 230 మిలియన్ల యూనిట్లు మార్కెట్లోకి వెళ్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వినియోగదారులు ఐఫోన్ వాడుతున్నారు. భారత్‌లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐఫోన్ వాటా గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఇది ఒక కలల ఫోన్ గా మారింది.
కొత్త మోడల్ వస్తే ప్రపంచం దానిపై ఆసక్తి
మొత్తానికి ఐఫోన్ కేవలం ఒక ఫోన్ కాదు. ఇది ఒక విప్లవం. టచ్ స్క్రీన్ ఫోన్ల ట్రెండ్, యాప్ స్టోర్ కల్చర్, ఫేస్ ఐడి లాంటి సెక్యూరిటీ ఫీచర్లు, అద్భుతమైన కెమెరా, ప్రత్యేకమైన డిజైన్ ఇవన్నీ ఐఫోన్ నుంచే మొదలయ్యాయి. ప్రతి కొత్త మోడల్ వస్తే ప్రపంచం దానిని ఆసక్తిగా ఎదురు చూస్తుంది.
ఐఫోన్ టెక్నాలజీ చరిత్రలో ఒక అద్భుత ఆవిష్కరణ
అందుకే ఐఫోన్ టెక్నాలజీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుత ఆవిష్కరణ. ఈ రోజు మనం వాడుతున్న ప్రతి స్మార్ట్‌ఫోన్ లోనూ ఐఫోన్ చూపించిన మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగానే ఐఫోన్ అన్నది ఫోన్ కంటే ఎక్కువ, మన ప్రపంచంలో పూర్తి మార్పు అని చెప్పొచ్చు.