Health tips: మీకు ఎప్పుడైనా నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా గుండెలపై ఎవరో కూర్చున్నట్లు అనిపించిందా? ఊపిరి ఆగిపోతున్నట్లూ… గొంతు పట్టేసినట్లూ… అరవాలని ప్రయత్నించినా మాట బయటకు రాకపోయిన సందర్భం ఎదురైందా? చాలా మందికి ఇలాంటి అనుభవం వస్తుంది. చాలా సార్లు దాన్ని దెయ్యాల పని అని, ఆత్మల ఇబ్బంది అని కూడా అనుకుంటారు. కానీ నిజానికి ఇది దెయ్యాల సమస్య కాదు. ఇది మన శరీరంలో సహజంగా జరిగే ఒక శారీరక చర్య. దీన్నే వైద్యులు స్లీప్ పెరాలసిస్ అని పిలుస్తారు.
స్లీప్ పెరాలసిస్ అనుభవం వచ్చినప్పుడు మన కళ్ళు తెరిచి ఉన్నట్టే అనిపిస్తుంది. గదిలో ఏమి జరుగుతుందో చూడగలుగుతాం. కానీ శరీరం మాత్రం ఒక్క అంగుళం కూడా కదలదు. మనకు గుండెలపై బరువుగా ఏదో ఉంది అనిపిస్తుంది. శ్వాస ఆడకపోవడం, గొంతు నులిమేస్తున్నట్లు అనిపించడం చాలా సహజం. ఇంకా చెప్పాలంటే కొంతమంది నీడలు కనిపించినట్టుగానీ, గదిలో ఎవరో నడుస్తున్నట్టుగానీ అనుభవిస్తారు. ఈ మొత్తం పరిస్థితి మనలో భయాన్ని పెంచుతుంది. అందుకే చాలామంది దీన్ని దెయ్యాల పనే అని భ్రమలో ఉంటారు.
అయితే అసలు విషయం ఏమిటంటే, నిద్ర రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నాన్ రెమ్ నిద్ర, ఇందులో మన శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది. రెండోది రెమ్ నిద్ర. ఈ రెమ్ నిద్రలోనే మనకు కలలు వస్తాయి. ఈ దశలో మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. కానీ ఒకేసారి మన శరీరం మాత్రం కదలకుండా “పారాలసిస్ మోడ్”లోకి వెళ్తుంది. ఎందుకంటే మనం కలలో ఏదైనా పరిగెడుతున్నా, కొట్టుకుంటున్నా నిజ జీవితంలో శరీరం కదలకుండా అడ్డుకోవడం కోసం మెదడు ఇలా చేస్తుంది. ఇది సహజ రక్షణ విధానం.
Also Read: Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?
కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, మన మెదడు ముందే మేల్కొంటుంది. కళ్ళు తెరిచి బయట ఏమి జరుగుతుందో మనం గమనించగలుగుతాం. కానీ శరీరం మాత్రం ఇంకా రెమ్ నిద్రలో ఉన్నట్టుగానే కదలకుండా ఉంటుంది. ఆ సమయంలో మనకు అనిపించేది ఏమిటంటే, శరీరం మొత్తం పక్షవాతం వచ్చినట్టే. ఛాతీ మీద ఎవరో కూర్చొని ఉన్నట్లుగా, గొంతు బిగిసినట్లూ అనిపిస్తుంది. నిజానికి ఇది శాస్త్రీయంగా స్లీప్ పెరాలసిస్.
ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ముఖ్య కారణం, సరైన నిద్ర లేకపోవడం. చాలా రోజులు రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని పనిచేయడం, ఒత్తిడితో ఉండడం వల్ల ఇది ఎక్కువ అవుతుంది. షిఫ్ట్ వర్క్ చేసే వాళ్లకు లేదా రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయేవారికి ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నార్కోలెప్సీ అనే నిద్ర సంబంధిత సమస్య ఉన్నవారికి ఇది తరచుగా వస్తుంది.
ఇది ప్రమాదకరమా అంటే కాదు. సాధారణంగా స్లీప్ పెరాలసిస్ వల్ల మన ఆరోగ్యానికి నేరుగా ఎలాంటి హాని ఉండదు. కానీ మనసుకు మాత్రం భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. రోజూ కనీసం ఏడుగంటల నుంచి ఎనిమిది గంటల వరకూ మంచి నిద్రపోవాలి. ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ముందు మొబైల్, లాప్‌టాప్, టీవీ వాడకాన్ని తగ్గించాలి. రాత్రివేళల్లో ఎక్కువ కాఫీ, టీ తాగకూడదు. అవసరమైతే మెడిటేషన్, శ్వాస వ్యాయామం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
ఒక్కోసారి ఇది రావడం పెద్ద సమస్య కాదు. కానీ చాలా తరచుగా వస్తే, నిద్రలోనే శ్వాస ఆగిపోతుందేమో అనే భయం కలిగిస్తే తప్పకుండా డాక్టర్‌ని సంప్రదించాలి. అందుకే, మీరు రాత్రి నిద్రలో గుండెలపై ఎవరో కూర్చొన్నట్లు అనిపిస్తే, మాట బయటకు రాకపోతే అది దెయ్యం కాదు, అది మన శరీరంలో సహజంగా జరిగే స్లీప్ పెరాలసిస్ మాత్రమే అని గుర్తించాలి. భయపడకుండా నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.