Landslides in Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి ప్రకృతి ప్రకోపం చూపించింది. కులూ జిల్లాలోని మణికరన్ సాహిబ్ గురుద్వారా సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా బలమైన గాలులు వచినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వ్యూ బాగుంటుండటంతో చాలా మంది పర్యటకులు తమ కార్లను ఆపి ఫోటోలు దిగుతున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కొండచరియలు విరిగిపడటం వల్ల ఓ భారీ వృక్షం వారిపై పడటంతో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ టీంని ప్రమాదం జరిగిన స్థలానికి పంపించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు ఇంకా తెలియలేదని అధికారులు వెల్లడించారు.
కాగా కొద్ది రోజుల క్రితం కూడా హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగి పడ్డ విషయం తెలిసిందే. ఒక్కసారిగా కొండచరియలు విరిగి పడడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.