Relationship Tips: పెళ్లికి ముందు అమ్మాయిల ఆలోచన ఒకలా ఉంటుంది. చేసుకోబోయేవాడు ఎంత సంపాదిస్తున్నాడు? వాళ్ల ఫ్యామిలీ ఎలా ఉంటుంది? అక్కడ మనం అడ్జస్ట్ కాగలమా లేదా? అంటూ రకరకాల ప్రశ్నలు ఆడవాళ్ల మనసులో మెదులుతాయి. నిజానికి అవి సహజమే.
కానీ పెళ్లైన తర్వాత మాత్రం భర్త మన పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు? మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు పక్కన ఉంటున్నాడా? లేక ఏదైనా సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడా? అన్నదే ముఖ్యం.
చాలామంది.. మా ఆయన మంచి గిఫ్టులు ఇస్తున్నాడు, అడిగిందల్లా కొనిస్తున్నాడు, నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు అంటూ సంబరపడిపోతుంటారు. కానీ ఒక మంచి భర్త అంటే కేవలం ఖరీదైన వస్తువులు ఇచ్చేవాడు కాదు. అసలు భార్యకు ఎలాంటి భర్త కావాలో చూస్తే కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవే.
మంచి భర్త అంటే భార్య ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కసురుకోకుండా ఓపికగా వినేవాడు. ఆమె ఏం చెబుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయానికీ వెంటనే కోప్పడటం లేదా ‘నీదే తప్పు’ అని చెప్పడం కాకుండా.. అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలి.
కొన్నిసార్లు భార్యకు పెద్ద సలహాలు అవసరం ఉండకపోవచ్చు. తన మాట వినే మనిషి పక్కన ఉంటే చాలు అనిపిస్తుంది. అలాంటి సమయంలో భర్త ఆమెకు అండగా నిలబడటం చాలా ముఖ్యం.
అన్నింటికంటే ముందు భర్తకు భార్యను గౌరవించే అలవాటు ఉండాలి. ఇంట్లో ఒకలా, బయట మరోలా ప్రవర్తించకూడదు. ఇతరుల ముందు భార్యను తక్కువ చేసి మాట్లాడటం అస్సలు మంచిది కాదు.
భార్యను గౌరవించే భర్త తనకు తోడుగా ఉన్నాడనే భావన భార్యలో ధైర్యాన్ని పెంచుతుంది. అంతేకాదు.. భార్యను గౌరవించడం అంటే చివరికి తన కుటుంబాన్ని, తన బంధాన్ని గౌరవించడమే.
‘భార్య మాట నేనెందుకు వినాలి?’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఏ సమస్య వచ్చినా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటేనే దానికి పరిష్కారం దొరుకుతుంది.
అలా కాకుండా చిన్న విషయానికే ఇగోలకు పోతే.. సమస్య మరింత పెద్దదవుతుంది. కాపురంలో ఇద్దరూ ఒకరి మాట ఒకరు వినడం చాలా అవసరం.
భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. ప్రతి చిన్న విషయానికీ ఆరాలు తీయడం, అనుమానించడం వల్ల బంధం బీటలు వారే అవకాశం ఉంటుంది.
‘ఎక్కడికి వెళ్లింది? ఎవరితో మాట్లాడింది?’ అంటూ ప్రతి విషయానికీ అనుమానం పెట్టడం కంటే.. తన భాగస్వామిపై నమ్మకం ఉంచడం మంచిది. భార్యకు కాస్త ఫ్రీడమ్ ఇచ్చే భర్త మంచి పార్ట్‌నర్‌గా నిలుస్తాడు.
భార్యకు ఎలాంటి కష్టం వచ్చినా భర్త తోడుగా ఉండటం చాలా ముఖ్యం. ‘నాకు నేనే.. నీకు నువ్వే’ అన్నట్టు సంసారం సాగిస్తే ఆ బంధం ఎక్కువ కాలం సంతోషంగా ఉండటం కష్టం.
కష్టం వచ్చినప్పుడు ‘భయపడకు.. నేను ఉన్నాను’ అని భరోసా ఇచ్చే భర్త దొరికితే.. అంతకంటే భార్యకు కావాల్సింది ఏముంటుంది?
ఇంటి పని, వంట పని మొత్తం భార్యే చేయాలి అనుకోవడం ఈ రోజుల్లో అస్సలు కరెక్ట్ కాదు. భార్య బిజీగా ఉన్నప్పుడు భర్త కూడా తన వంతుగా చిన్న చిన్న పనులు చేయాలి.
ఇద్దరూ కలిసి ఇంటి పనులను పంచుకుంటే భార్యకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అంతేకాదు.. ఒకరి కష్టాన్ని మరొకరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా ఇద్దరూ కలిసి నడిస్తే సంసారం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది.
భార్య ఏదైనా సాధించాలని ఆశపడితే ఆమెను డిసప్పాయింట్ చేయకుండా ఎంకరేజ్ చేయాలి. ‘నేను చేస్తున్నా కదా.. నువ్వెందుకు?’ అంటూ కించపరచకూడదు.
భార్య ఎదుగుతుంటే దాన్ని తన ఎదుగుదలగా భావించే భర్త దొరికితే.. ఆ అమ్మాయికి అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది?
పెద్ద పెద్ద గిఫ్టులు ఇవ్వడం మాత్రమే ప్రేమ కాదు. చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రేమ చూపించవచ్చు.
‘తిన్నావా?’, ‘ఎలా ఉంది?’, ‘కాస్త రిలాక్స్ అవ్వొచ్చుగా’ అంటూ ప్రేమగా అడిగే మాటలు భార్యకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఆమెకు ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవడం కూడా ఆమెకు ప్రత్యేకంగా అనిపిస్తుంది.
అన్నింటికంటే ముఖ్యంగా భార్యను ఇతరులతో పోల్చవద్దు. ఆడవాళ్లు తమను ఇతరులతో పోల్చినప్పుడు చాలా బాధపడతారు.
అలా కాకుండా భార్యలో ఉన్న లోపాలను అర్థం చేసుకుని.. ఏదైనా మార్చుకోవాల్సి ఉంటే ఆమెకు అర్థమయ్యేలా ప్రేమగా చెప్పాలి. విమర్శించకుండా మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది.
మీ వాళ్ల వల్ల ఏదైనా తప్పు జరిగినా మొహమాటానికి పోకుండా భార్యకు సారీ చెప్పాలి. భర్తే కాబట్టి ఎప్పుడూ తానే కరెక్ట్ అని అనుకోవడం కంటే.. తప్పు తనదైతే ఒప్పుకోవడం గొప్ప విషయం.
ఒక చిన్న ‘సారీ’తో పెద్ద గొడవను కూడా ఆపేయొచ్చు. ఇక్కడ తగ్గడం ఓటమి కాదు.. బంధాన్ని కాపాడుకోవడం.
ALSO READ:రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ పోస్టర్ మామూలుగా లేదుగా!
మొత్తానికి మంచి భర్త అంటే డబ్బులు సంపాదించేవాడు మాత్రమే కాదు. భార్య మాట వినేవాడు, ఆమెను గౌరవించేవాడు, నమ్మేవాడు, కష్టాల్లో తోడుగా ఉండేవాడు, ఇంటి పనుల్లో సాయం చేసేవాడు, ఆమె కలలకు సపోర్ట్ చేసేవాడు.
ఇలాంటి లక్షణాలతో పాటు చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రేమను చూపించే భర్త దొరికితే.. ఆ భార్య నిజంగా లక్కీనే!