Vintage Culture: కాలం మారుతోంది.. టెక్నాలజీ పరుగులు పెడుతోంది… పాత వస్తువులన్నీ కనుమరుగైపోతున్నాయని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది! ఒకప్పుడు పాతకాలం వస్తువులని పక్కన పెట్టేసినవే.. ఇప్పుడు Gen Zకి ఫేవరెట్ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు వదిలి డబ్బా ఫోన్లు వాడుతున్నారు.. డిజిటల్ కెమెరాలు ఉండగా పాత ఫిల్మ్ కెమెరాల కోసం వెతుకుతున్నారు.. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్లు ఉండగా వైర్డ్ ఇయర్‌ఫోన్లు పెట్టుకుంటున్నారు. అసలు ఈ Gen Zకి పాత వస్తువులపై ఇంత ప్రేమ ఎందుకు పెరిగింది? వాళ్లు ఇష్టపడుతున్న ఆ రెట్రో ప్రపంచం ఏంటో చూద్దాం!
పాతకాలపు వస్తువులకు కొత్త స్టైల్
దీనినే ఇప్పుడు Newtro Trend అంటున్నారు. అంటే New + Retro. పాతకాలపు వస్తువులకు కొత్త స్టైల్ ఇవ్వడం. మనం చిన్నప్పుడు చూసినవి, మన తల్లిదండ్రులు వాడినవి.. చివరికి మనం పుట్టకముందు నుంచే ఉన్న వస్తువులు కూడా ఇప్పుడు Gen Zకి చాలా స్పెషల్‌గా మారుతున్నాయి. దీనికి ఒక ముఖ్యమైన కారణం.. డిజిటల్ ప్రపంచం నుంచి కొంత రిలీఫ్ కావాలనుకోవడం. ఉదయం లేవగానే ఫోన్ చూడాలి.. రోజంతా నోటిఫికేషన్లు.. సోషల్ మీడియా.. మెసేజ్‌లు.. సబ్‌స్క్రిప్షన్లు.. ఇలా స్క్రీన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అందుకే కొంతమంది యువత మళ్లీ సింపుల్‌గా ఉండే పాత వస్తువుల వైపు వెళ్తున్నారు.
స్మార్ట్‌ఫోన్లు వదిలి ‘డబ్బా ఫోన్లు’
మొదట ఫీచర్ ఫోన్లు. ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లే కనిపిస్తున్నాయి. కానీ Gen Zలో కొంతమంది మాత్రం పాతకాలపు కీప్యాడ్ ఫోన్లను ఇష్టపడుతున్నారు. కాల్స్ మాట్లాడటం, మెసేజ్‌లు పంపడం.. అంతే! గంటల తరబడి రీల్స్ చూడాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ల గొడవ ఉండదు. వీకెండ్‌లో స్మార్ట్‌ఫోన్ పక్కన పెట్టి ఫీచర్ ఫోన్ వాడటం, డిజిటల్ డీటాక్స్ చేయడం కూడా ఒక ట్రెండ్‌గా మారుతోంది.
ఫిల్మ్ కెమెరాల మజా వెనక అసలు రహస్యం!
తర్వాత డిస్పోజబుల్ కెమెరాలు, ఫిల్మ్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు ఫోన్‌లోనే వందల ఫోటోలు తీసుకోవచ్చు. ఫిల్టర్లు పెట్టుకోవచ్చు.. నచ్చకపోతే డిలీట్ చేయొచ్చు. కానీ Gen Zకి మాత్రం ఫిల్మ్ కెమెరాలతో ఫోటోలు తీయడంలోనే అసలైన మజా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కో రోల్‌లో పరిమిత సంఖ్యలోనే ఫోటోలు తీయగలం. తీసిన ఫోటో వెంటనే చూడలేం. డెవలప్ అయ్యాకే తెలుస్తుంది. ఆ ఫోటో ఎలా వచ్చిందోనన్న ఎదురుచూపు కూడా వాళ్లకు ఒక ప్రత్యేకమైన అనుభూతి.
ట్రెండ్ అవుతున్న వైర్డ్ ఇయర్‌ఫోన్లు..
వైర్డ్ ఇయర్‌ఫోన్లు కూడా మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. ఎయిర్‌పాడ్స్ వచ్చిన తర్వాత వైర్డ్ ఇయర్‌ఫోన్లు పాతబడిపోయాయి. కానీ ఇప్పుడు Gen Z మళ్లీ వాటినే వాడుతున్నారు. చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు.. బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేదు.. పోగొట్టుకుంటామనే భయం కూడా తక్కువ. పైగా పాతకాలపు స్టైల్‌కు ఒక ప్రత్యేకమైన లుక్ ఉంటుందని ఫీల్ అవుతున్నారు.
మ్యూజిక్‌లోనూ ఇదే ట్రెండ్..
మ్యూజిక్‌లోనూ ఇదే ట్రెండ్. Spotify, YouTubeలో పాటలు వినొచ్చు. కానీ కొంతమంది యువత మాత్రం వినైల్ రికార్డ్స్, గ్రామోఫోన్ రికార్డ్స్, క్యాసెట్లు, CDలు వెతుకుతున్నారు . తమకు నచ్చిన ఆల్బమ్‌ను మొదటి పాట నుంచి చివరి పాట వరకు వినడం.. ఫేవరెట్ ఆర్టిస్ట్ రికార్డ్‌ను కలెక్షన్‌లో పెట్టుకోవడం వాళ్లకు ఇష్టం. కేవలం పాట వినడం కాదు.. ఆ మ్యూజిక్‌తో ఒక అనుభూతిని పొందాలనుకుంటున్నారు.
ఫ్యాషన్‌లోనూ 90s, Y2K స్టైల్ మళ్లీ వచ్చేసింది.
ఒకప్పుడు పాత ఫ్యాషన్‌గా చూసిన ఓవర్‌సైజ్డ్ డెనిమ్ జీన్స్, వింటేజ్ జాకెట్లు, గ్రాఫిక్ టీషర్ట్స్, క్లాసిక్ స్నీకర్స్, పాతకాలపు యాక్సెసరీస్ ఇప్పుడు Gen Z వార్డ్‌రోబ్‌లో కనిపిస్తున్నాయి. కొత్తగా కనిపించాలంటే కొత్త డ్రెస్ కొనాల్సిన అవసరం లేదని.. పాత స్టైల్‌ను కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇక పాత పుస్తకాలు, కామిక్స్, మేగజైన్స్, సెకండ్‌హ్యాండ్ బుక్స్ కొనడం కూడా యువతలో ఆసక్తిగా మారుతోంది. కొత్త పుస్తకం కంటే పాత ఎడిషన్ దొరికితే అదొక ట్రెజర్‌లా భావిస్తున్నారు.
హైదరాబాద్‌లోనూ Vintage Culture!
ఈ ట్రెండ్ హైదరాబాద్‌లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. పాతకాలపు ఫీల్ ఇచ్చే కేఫ్‌లకు యువత వెళ్తున్నారు. The Coffee Cup, Motown Stories Café, Roastery Coffee House, Katha Coffee and Bake House లాంటి చోట్ల కాఫీతో పాటు కొంత సమయం గడపడం, చదవడం, జర్నలింగ్ చేయడం ఇష్టపడుతున్నారు. కేవలం కేఫ్‌లే కాదు.. Karaoke క్లబ్‌లలో పాత పాటలు పాడుతూ కొత్త స్నేహాలు చేసుకుంటున్నారు. Hyderabad Karaoke Club, Norebox లాంటి వేదికల్లో గ్రూప్‌గా పాటలు పాడటం, మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయడం చేస్తున్నారు.
పాత కెమెరాలపై ఆసక్తి..
ఇక Fashion Yatra, Thrift Dock వంటి థ్రిఫ్ట్ స్టోర్స్‌లో వింటేజ్ డ్రెస్‌ల కోసం వెతుకుతున్నారు. Sunday Book Bazaar, Book Mart వంటి చోట్ల పాత పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. ఫిల్మ్ ఫోటోగ్రఫీ, పాత కెమెరాలపై ఆసక్తి ఉన్నవాళ్లు వింటేజ్ కెమెరాల కోసం కూడా వెతుకుతున్నారు.
Pastను ఆస్వాదిస్తున్నా Gen Z
అయితే Gen Z పాతకాలంలోకి వెళ్లిపోవాలని అనుకుంటున్నారా? అంటే కాదు. వాళ్లు టెక్నాలజీని వదిలేయడం లేదు. కానీ ప్రతీ పనికీ ఫోన్ మీద ఆధారపడకుండా.. తమకు నచ్చిన కొన్ని విషయాలను సింపుల్‌గా ఆస్వాదించాలనుకుంటున్నారు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌లో ఫోటో తీస్తే వెంటనే చూడొచ్చు.. కానీ ఫిల్మ్ కెమెరాలో తీసిన ఫోటో కోసం ఎదురుచూడాలి. ఆ ఎదురుచూపులోనే ఒక ఆనందం ఉంటుంది. పాటను యాప్‌లో వినొచ్చు.. కానీ మన దగ్గరే ఉన్న రికార్డ్ ప్లేయర్‌లో వినడంలో మరో అనుభూతి ఉంటుంది. అందుకే ఇప్పుడు పాతవి పనికిరానివి కావడం లేదు.. కొత్త ట్రెండ్‌గా మారుతున్నాయి. కాలం మారినా కొన్ని వస్తువులపై ప్రేమ మాత్రం మారడం లేదు. మొత్తానికి.. Future వైపు పరుగులు తీస్తున్న Gen Z, మధ్యలో కాస్త ఆగి Pastను కూడా ఆస్వాదిస్తోంది!
Also Read: 52 టన్నులు.. రూ.72 వేల కోట్ల వ్యాపారం.. ఈ బంగారం క్రేజ్‌కు రీజన్స్ ఇవే!