Vidur Niti Money Management| డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే, దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయడం మరో ఎత్తు. కొందరు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు. అనవసర ఖర్చులు, చెడు అలవాట్లు, తప్పుడు నిర్ణయాలు వారి ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తాయి. అయితే సంపాదించిన ప్రతి రూపాయిని ఎలా ఉపయోగించాలో మనకు పురాతన కాలం నుంచే ఎన్నో విలువైన సూచనలు ఉన్నాయి.
మహాభారతంలో హస్తినాపురం ముఖ్యమంత్రి అయిన మహాత్మా విదురుడు తన నీతుల్లో సంపద నిర్వహణ గురించి కూడా ముఖ్యమైన విషయాలను వివరించారు. ముఖ్యంగా 4 విషయాలపై డబ్బు ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన బోధనలు సూచిస్తున్నాయి.
విదుర నీతి ప్రకారం.. సంపదను నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా జూదం, మద్యపానం వంటి వ్యసనాల కోసం డబ్బు ఖర్చు చేయడం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది.
ఇలాంటి అలవాట్లు మొదట సరదాగా అనిపించినా, క్రమంగా ఎక్కువ డబ్బు ఖర్చు చేయిస్తాయి. దీంతో రోజువారీ అవసరాలకు కూడా డబ్బు సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ బాధ్యతలను సైతం సరిగ్గా నిర్వహించలేరు. అందుకే చెడు అలవాట్లను నియంత్రించుకుని సంపాదనను అవసరాలకు ఉపయోగించాలి.
సమాజంలో గొప్పగా కనిపించాలనే కోరిక చాలామందిని అనవసర ఖర్చుల వైపు నడిపిస్తుంది. ఖరీదైన దుస్తులు, మొబైల్ ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇతరులతో పోల్చుకుంటూ మన స్థాయికి మించి ఖర్చు చేయడం మంచిది కాదు. కొందరు తమ ఆర్థిక స్థోమతకు మించి అప్పులు చేసి మరీ విలాసవంతమైన జీవితం గడపాలని చూస్తారు. ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో అప్పుల భారాన్ని పెంచుతాయి. అందుకే ఇతరులను చూసి కాకుండా, మన ఆదాయాన్ని బట్టి ఖర్చులు చేయాలి.
డబ్బు విషయంలో ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. నిజాయితీ లేని వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వడం వల్ల తిరిగి పొందలేని పరిస్థితి రావచ్చు. అలాగే వ్యాపార భాగస్వామ్యాలు, ఆర్థిక ఒప్పందాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఎదుటివారి నేపథ్యం, నమ్మకాన్ని పరిశీలించిన తర్వాతే డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టపడి సంపాదించిన సొమ్ము నష్టపోయే అవకాశం ఉంది.
Also Read: భగవద్గీత.. జీవితంలో ఎదగాలంటే ఈ 3 చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో చాలామంది ఆలోచించకుండా పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఏ వ్యాపారంలోనైనా లేదా ఆర్థిక పథకంలోనైనా డబ్బు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆ పెట్టుబడిలో ఉండే నష్టభయాలు, లాభాలు, సంబంధిత వ్యక్తుల విశ్వసనీయతను పరిశీలించాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెడితే సంపాదించిన డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
Also Read: చాణక్య నీతి.. భర్తలు చేసే ఈ 5 తప్పులు వల్లే వైవాహిక జీవితం నాశనం
సంపదను సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. చెడు అలవాట్లు, అనవసర ఆడంబరాలు, నమ్మకంలేని వ్యక్తులు, అవగాహనలేని పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఎంత సంపద ఉన్నా తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే పేదరికం వెంటాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించి ఖర్చు చేయడం, పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి.