Masala kulcha: ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో అందరికీ ఏదైనా స్పెషల్‌గా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కోసమైనా, లంచ్ కోసమైనా వేడివేడి ‘మసాలా కుల్చా’ చేసుకుంటే ఇంటిల్లిపాదీ లొట్టలేసుకుంటూ తింటారు. పైన కాస్త క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా ఉండే ఈ కుల్చా మీద బటర్, కొత్తిమీర, కారంగా ఉండే మసాలా జల్లి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా మైదాతో చేసే వీటిని, ఆరోగ్యం కోసం మనం ఇంట్లోనే గోధుమ పిండితో చాలా సులభంగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
ఈ రుచికరమైన కుల్చా కోసం రెండున్నర కప్పుల గోధుమ పిండి, పావు కప్పు గోరువెచ్చని నీళ్లు, రెండు టీస్పూన్ల చక్కెర, రెండు టీస్పూన్ల ఇన్‌స్టంట్ డ్రై ఈస్ట్, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. పిండి కలపడానికి తగినన్ని నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ బటర్, కొద్దిగా నూనె, సన్నగా తరిగిన కొత్తిమీర సిద్ధం చేసుకోవాలి. ఇక పైన వేసే మసాలా కోసం కారం, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి అవసరం అవుతాయి.
Also Read: పిల్లల ముఖాల్లో నవ్వులు పూయించే హోమ్‌మేడ్ పొటాటో స్మైలీ.. చాలా సులువుగా చేసేయండిలా!
ముందుగా ఒక చిన్న గిన్నెలో గోరువెచ్చని నీళ్లు, చక్కెర, ఇన్‌స్టంట్ డ్రై ఈస్ట్ వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి. అది నురగలా పొంగిన తర్వాత, ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, పెరుగు వేసి కలపాలి. ఇందులో ఈస్ట్ మిశ్రమం, తగినన్ని నీళ్లు పోస్తూ మెత్తని పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి మరోసారి బాగా మర్దన చేయాలి. పిండిని ముద్దలా చేసి, పైన కొద్దిగా నూనె రాసి గాలి తగలకుండా కవర్ చేసి, వెచ్చని ప్రదేశంలో గంటన్నర పాటు నానబెట్టాలి.
పిండి బాగా పొంగిన తర్వాత, దాన్ని సమాన భాగాలుగా చేసి ఉండలుగా చుట్టుకోవాలి. వీటిని పొడి పిండిలో అద్దుతూ ఓవల్ ఆకారంలో కుల్చాలా ఒత్తుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న పెనం మీద కుల్చా వేసి, పైన బుడగలు రాగానే రెండో వైపు తిప్పాలి. చుట్టూ కొద్దిగా నీళ్లు చిలకరించి మూత పెడితే, ఆవిరికి కుల్చా లోపలి వరకు చక్కగా ఉడుకుతుంది.
చివరగా పెనం మీద కొద్దిగా బటర్ వేసి, అందులో కొత్తిమీర, కారం, చాట్ మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిపై కుల్చా వేసి రెండు వైపులా రెండు నిమిషాలు కాల్చుకుంటే ఎంతో రుచికరమైన మసాలా కుల్చా రెడీ. దీన్ని వేడివేడి చోలే లేదా మీకు నచ్చిన ఏదైనా కర్రీతో తింటే ఆదివారం విందు అదిరిపోతుంది.
Also Read: ఇంట్లో ఉండే మసాలాలతోనే పైకి క్రిస్పీగా, లోపల జ్యూసీగా కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ ఫ్రైస్!