Green Moong Dal Laddu: భోజనం చేశాక ఏదైనా తీపి తినాలనిపించడం సహజం. కానీ డైట్, ఫిట్‌నెస్ గురించి ఆలోచించే వాళ్లు స్వీట్ల పేరు చెబితేనే దూరం జరుగుతుంటారు. చక్కెర, బెల్లం వాడకుండా ఏదైనా ఆరోగ్యకరమైన స్వీట్ తింటే బాగుంటుందని ఆశపడే వాళ్ల కోసం ఈ పెసరపప్పు డ్రై ఫ్రూట్ లడ్డూ ఒక అద్భుతమైన ఎంపిక. పెసరపప్పు, రకరకాల గింజలు, ఖర్జూరాలతో చేసే ఈ లడ్డూలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇంట్లోనే ఎంతో సులభంగా వీటిని తయారు చేసుకుని, ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే ఆకలి వేసినప్పుడల్లా ఒకటి తినేయొచ్చు.
ఈ లడ్డూల కోసం 5 గంటలు నానబెట్టిన పెసరపప్పు ఒక కప్పు, బాదం పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, వాల్‌నట్స్ పావు కప్పు, పిస్తా రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. వీటితో పాటు గుమ్మడి గింజలు రెండు టేబుల్ స్పూన్లు, పొద్దుతిరుగుడు గింజలు రెండు టేబుల్ స్పూన్లు, చియా గింజలు ఒక టేబుల్ స్పూన్, వేయించిన అవిసె గింజలు ఒక టేబుల్ స్పూన్ అవసరం. తీపి కోసం గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరాలు పది, కిస్‌మిస్ పావు కప్పు తీసుకోవాలి. అలాగే రెండు టేబుల్ స్పూన్ల దేశీ నెయ్యి, అర టీస్పూన్ యాలకుల పొడి సిద్ధం చేసుకోవాలి.
Also Read: అల్లం ఎండిపోకుండా నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి!
ముందుగా నానబెట్టిన పెసరపప్పులో నీళ్లు పూర్తిగా వంపేసి, ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ మీద ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి, నెయ్యి వేయకుండా సన్నని మంటపై పెసరపప్పును దోరగా, మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.
పప్పు పూర్తిగా చల్లారాక మిక్సీలో కాస్త బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా, గుమ్మడి, పొద్దుతిరుగుడు, అవిసె గింజలను మాడిపోకుండా సన్నని మంటపై దోరగా వేయించి, చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మళ్లీ పాన్‌లో నెయ్యి వేసి, తరిగిన ఖర్జూరాలు, కిస్‌మిస్ వేసి 3 నిమిషాల పాటు మెత్తబడే వరకు కలపాలి. ఇందులో మిక్సీ పట్టిన పెసరపప్పు పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, చియా గింజలు, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి.
పెసరపప్పు లడ్డూలలో చక్కెర గానీ, బెల్లం గానీ అస్సలు వాడలేదు కాబట్టి.. డైట్ చేసేవారికి ఇది బెస్ట్ స్నాక్. ఖర్జూరం, కిస్‌మిస్‌ల వల్ల సహజమైన తీపి వస్తుంది. ఒకవేళ మీకు తీపి అస్సలు వద్దనుకుంటే వీటిని మానేసి, లడ్డూలు చుట్టడానికి కాస్త నెయ్యి ఎక్కువగా వాడుకోవచ్చు. పెసరపప్పులోని ప్రోటీన్లు, డ్రై ఫ్రూట్స్‌లోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.
Also Read: ఉదయం టిఫిన్‌కు రవ్వ ఉప్మా మంచిదా, ఓట్స్ తింటే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే!