Employees Unions: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న ఇంటర్నల్ వార్ తెరమీదకి వచ్చింది. తమ హక్కులు, డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం పై ప్రెజర్ పెంచాల్సిన ఉద్యోగులు ఇప్పుడు తమ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జేఏసీ, టీజీవో, టీఎన్జీవో సంఘాల నాయకులపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేయడం విశేషం. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ గొంతుక వినిపించాల్సిన నాయకులు,సొంత ప్రయోజనాల కోసం ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని సాధారణ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వర్సెస్ ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య తీవ్రమైన ‘కోల్డ్ వార్’ కొనసాగుతున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి ప్రధాన కారణం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు తీరు అని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఐదు నెలలుగా ఉద్యోగుల జీతాల నుంచి ప్రతినెలా సుమారు రూ.300 కోట్ల వరకు ఈహెచ్ఎస్ కోసం కోత విధిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.హెల్త్ కార్డులు పట్టుకుని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా,యాజమాన్యాలు వాటిని నిరాకరిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ‘పేమెంట్ మోడ్’లో (నగదు చెల్లించి) వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు.ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న చేదు అనుభవాలను పలువురు ఉద్యోగులు సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.
రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ ప్రైవేట్, కార్పొరేట్ దవాఖాన్లలో ఈహెచ్ ఎస్ స్కీమ్ అమలు కావడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎంప్యానెల్ దవాఖాన్లలోనూ వైద్యాన్ని తిరస్కరిస్తున్నట్లు ఎంప్లాయిస్ చెబుతున్నారు. ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఈ సమస్యను తీసుకువెళ్లినా..ఫలితం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ వర్తించకపోవడంతో ఓ ఉద్యోగి కుటుంబం ఏకంగా రూ. 3 లక్షలు నగదు చెల్లించాల్సి వచ్చిందని, అంత ఖర్చు చేసినా పేషెంట్ దక్కలేదని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అంతేగాక వికారాబాద్ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయురాలు తన వైద్యం కోసం ఈహెచ్ఎస్ కార్డు పనిచేయకపోవడంతో సొంతంగా లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తన గోడును వెళ్లబోసుకున్నారు. తమ జీతాల్లోంచి చందాలు కడితే,అత్యవసర సమయంలో ఉపయోగపడకపోవడం దారుణమని ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉద్యోగి ఆరోగ్య భద్రతను కూడా వ్యాపారంగా మార్చేస్తారా? అంటూ ప్రైవేట్ ఆసుపత్రులను ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
Also read: సీనియర్ సిటిజన్లకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిన బెంగళూరు-గోవా వందే భారత్.. ఎందుకో తెలుసా?
మరోవైపు పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు,పీఆర్సీ అమలు,సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలనే డిమాండ్లపై ఉద్యోగుల్లో అసహనం వ్యక్తం అవుతుంది. తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగులు ధర్నాలు, నిరసనలు చేస్తున్న క్రమంలో కొందరు యూనియన్ నాయకులు వెనక్కి తగ్గి వాటిని విరమింపజేశారని పలువురు ఉద్యోగులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.”మీరు ఉద్యోగ ప్రతినిధులా? లేక ప్రభుత్వ ప్రతినిధులా? ఒక్క పీఆర్సీ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాలా? హక్కుగా రావాల్సిన డీఏలను అప్పుగా అడిగి తెచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారా? అర్ధరాత్రి జీవోలతో బేరసారాలు చేస్తూ ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టడానికి మీకు మనసెలా ఒప్పింది?” అంటూ ఓ ఉద్యోగి ఏకంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు.
ఉద్యోగ సంఘాల ముఖ్య నాయకులు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించకపోవడానికి వారి వ్యక్తిగత ప్రయోజనాలే కారణమని ఆరోపిస్తూ ఒక ఉద్యోగి విడుదల చేసిన వీడియో ఇప్పుడు ఉద్యోగ గ్రూపుల్లో వైరల్గా మారింది.సదరు వీడియోలోని ఆరోపణల ప్రకారం, యూనియన్లలోని ఒక ముఖ్యనేతకు ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ ఉందని, మరో కీలక నేతకు ఉద్యోగ పదవీకాలం పొడిగింపు (ఎక్స్టెన్షన్) వంటి ప్రయోజనాలు ఆశ చూపారని, అందుకే వారంతా మౌనంగా ఉంటున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు.అందుకే ప్రస్తుత నాయకత్వంపై నమ్మకం కోల్పోయిన కొందరు ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు అంతా కలిసి ఒక కొత్త జేఏసీని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. “సమస్యలపై ప్రశ్నించాల్సిన నాయకులు పదవుల పొడిగింపుల కోసం ఆశపడి మౌనం వహిస్తే సామాన్య ఉద్యోగి, పెన్షనర్ ఎవరికి చెప్పుకోవాలి? ఇది కేవలం హెచ్చరిక కాదు.. ఆకలి, ఆరోగ్య భద్రత, ఆత్మగౌరవం కోసం సాగుతున్న ధర్మపోరాటం” అంటూ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పీఆర్సీ, ఓపీఎస్, ఈహెచ్ఎస్ హామీలపై సంఘాల నేతలు చిత్తశుద్ధితో స్పందించకపోతే, ఉద్యోగ సమిష్టి ఐక్యతే వారికి తగిన గుణపాఠం చెబుతుందని ఆ పోస్టుల్లో స్పష్టం చేస్తున్నారు.
ఉద్యోగుల నుంచి వస్తున్న ఈ విమర్శలపై ఉద్యోగ సంఘాల నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి కంటే చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవడం ఉత్తమమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈహెచ్ఎస్ విధివిధానాల సవరణ, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, డీఏల విడుదలపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలతో పలు దఫాలుగా చర్చలు జరిపామని, త్వరలోనే సానుకూల నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. తాము ఎవరి ప్రయోజనాల కోసమో ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టామనడంలో వాస్తవం లేదని, ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి రూపాయిని సాధించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని వారు వివరణ ఇస్తున్నారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య భద్రత కరువై సాధారణ ఉద్యోగులు ఆందోళన చెందుతుంటే, మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం సాధిస్తామని సంఘాల నేతలు చెబుతున్నారు.
టీజీవో, టీఎన్ జీవో నాయకుల స్వార్థం కోసం ఉద్యోగులందరి జీవితాలు నాశనం చేయడం సరికాదు. ముఖ్యంగా హెల్త్ కార్డు విషయంలో ఉద్యోగులందరికీ అభద్రత భావం ఉన్నది. శాలరీలో కొంత మొత్తాన్ని కట్ చేస్తూ, సరిగ్గా అమలు చేయపోవడం సరికాదు. చాలా మంది ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది. వాస్తవానికి ఈ ఈహెచ్ ఎస్ కు విల్లింగ్ ఉన్న ఉద్యోగులకే వర్తింపచేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇష్టం లేకపోయినా..డబ్బులు కట్ చేయడం దారుణం. ఇప్పటికే కట్ అయినా డబ్బును రిటర్న్ ఇచ్చేస్తే మంచి జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగుల పిల్లలకు వాళ్ల కంపెనీల్లో ఇన్సురెన్స్ లు ఉంటాయి. ఈహెచ్ఎస్ అంటే ప్రైవేట్ ఆసుపత్రులు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈ అంశాన్ని సీరియస్ గా పరిశీలించాలి”అంటూ ఎస్ కే ప్రసన్న పేర్కొన్నారు.
Also read: హరీష్ రావుకు కోలుకోలేని దెబ్బ.. కవిత సంచలన వ్యూహం!