స్త్రీలకు 12 ఏళ్ల వయసులో మొదలైన రుతుక్రమం 45 ఏళ్లు దాటాక మెనోపాజ్ తో ఆగిపోతుంది. అంటే వారికి ప్రతినెలా ఇక రుతుస్రావం అవ్వదు. దీన్నే మెనోపాజ్ దశ అని పిలుస్తారు. అయితే మెనోపాజ్ అనేది కేవలం మహిళలకు సంబంధించిందే అని అనుకుంటారు. నిజానికి మగవారికి కూడా మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ వచ్చినప్పుడు వారిలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
పురుషుల్లో మెనోపాజ్ ఎప్పుడు?
మగవారిలో కూడా మహిళల్లాగే 50 సంవత్సరాల వయసులో మెనోపాజ్ వస్తుంది. దీని లక్షణాలు శారీరకంగా, మానసికంగా, లైంగికంగా ఎంతో మార్పును చూపిస్తాయి. పురుషుల్లో వచ్చే మెనోపాజ్ ను ఆండ్రోపాజ్ అని అంటారు. పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల వచ్చే పరిస్థితి ఇది. సాధారణంగా 50 ఏళ్లు దాటినా లేదా అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న పురుషులలో ఇది కనిపిస్తుంది. మెనోపాజ్ వచ్చినప్పుడు మగవారిలో తీవ్రమైన అలసట, నిద్ర పట్టకపోవడం, మానసిక స్థితిలో విపరీతమైన మార్పులు వంటివి కనిపిస్తాయి. దీనికి కారణం టెస్టోస్టెరాన్ లోపం.
పురుషుల్లో మెనోపాజ్ లక్షణాలు
మెనోపాజ్ బారిన పడిన పురుషులు నిరుత్సాహంగా కనిపిస్తారు. ఎప్పుడూ విచారంగా ఉంటారు. అలసిపోయినట్లుగా వారికి అనిపిస్తుంది. ఏ పనిపైనా ఆసక్తి ఉండదు. తమపై తాము ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఏకాగ్రత తగ్గిపోతుంది. తరచూ నిద్రలేమి సమస్య ఇబ్బంది పెడుతుంది. బరువు పెరిగిపోతారు. కండరాలు బలహీనంగా మారుతాయి. రొమ్ములు కూడా పెరుగుతాయి. ఎముకలు బలహీనపడతాయి. లైంగిక జీవితంపై ఆసక్తి తగ్గిపోతుంది. అంగస్తంభన లోపం కనిపిస్తుంది. జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అలాగే వారి వృషణాల పరిమాణం తగ్గిపోతుంది. ఒళ్లంతా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది.
మీకు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించండి. వారు రక్త పరీక్ష ద్వారా మీ శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలను తనిఖీ చేస్తారు.
ఆ సమయంలో ఇలా చేయండి
మెనోపాజ్ వచ్చినప్పుడు మహిళలు ఎలా ఆరోగ్యంలో తీవ్ర మార్పులకు గురవుతారో… మగవారు కూడా గురవుతారు. కాబట్టి ఆ దశకు చేరుకున్న పురుషులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురి కాకూడదు. ప్రతిరోజు ధ్యానం చేయాలి.
లక్షణాలు మరీ తీవ్రంగా ఉంటే వైద్యులు టెస్టోస్టెరాన్ హార్మోన్ చికిత్స కూడా సిఫారసు చేస్తారు. దీని వల్ల కొంతవరకు ప్రతికూలతలు తగ్గుతాయి.