ముంబైలో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. ఇంతవరకు ఇలాంటి శస్త్ర చికిత్స ఎవరికైనా జరిగిందో లేదో తెలియదు.. కానీ 26 ఏళ్ల వ్యక్తికి పురుషాంగం పొడవును పెంచే శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. అతడికి మైక్రో పెనిస్ అనే వ్యాధి ఉంది. పుట్టుకతోనే వచ్చే వ్యాధి ఇది. పది లక్షల మంది పురుషులలో ఒకరిని మాత్రమే ప్రభావితం చేస్తుంది.
మైక్రోపెనిస్ వ్యాధితోనే సమస్య
ఈ వ్యాధి బారిన పడిన వారికి వృషణాలు సరిగ్గా అభివృద్ధి చెందవు. దీనివల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి. పురుషాంగం పొడవు కేవలం రెండు2.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. దీంతో 26 ఏళ్ల వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా మానసికంగా కుంగిపోతూ వచ్చాడు. భావోద్వేగపరంగా అతను పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళాడు. వివాహం, కుటుంబ జీవితం పై ఆశలు పెట్టుకున్న అతడు వైద్యులను కలిసి తన సమస్యను చెప్పుకున్నాడు.
ముంబైలోని డాక్టర్ సనీష్ సిరిగార్పురే, అలాగే కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ ఆసిష్ సంగ్వీకార్ నేతృత్వంలో వైద్య బృందం అతనికి అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించింది. మూడు గంటల పాటు ఈ ఆపరేషన్ సాగింది. అతడి అంగం పొడవును విజయవంతంగా పెంచారు వైద్యులు.
ఈ విషయంపై వైద్యులు మాట్లాడుతూ వైద్యపరంగా, భావోద్వేగ పరంగా ఈ కేసు ఎంతో సున్నితమైనదని చెప్పారు. మైక్రోపెనిస్ వ్యాధితో బాధపడుతున్న రోగులు తరచూ తమలో తామే బాధపడుతూ ఉంటారు. సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జనకు కూడా వెళ్లరు. తమ పరిస్థితిని నిత్యం దాచేందుకు ఎంతో కష్టపడతారు. స్నేహితులతో కలిసి ఏ పర్యటనకు వెళ్లలేరు కూడా. తమ సమస్య బయటపడుతుందేమోనని వారు భయపడతారు.
ఈ వ్యాధి వల్ల జరిగేది ఇదే
మైక్రోపెనిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి చిన్నప్పుడే హార్మోన్ల చికిత్సను అందించాలి. అయితే చాలామంది వివాహ వయస్సు దగ్గరలో ఉన్నప్పుడే ఆపరేషన్ గురించి ఆలోచిస్తారు. అప్పుడే వైద్య ఆ వయసులోనే వైద్యులను సంప్రదిస్తారు. మైక్రోపెనిస్ ఉన్న వ్యక్తికి టెస్టోస్టరాన్ హార్మోను చాలా తక్కువగా ఏర్పడుతుంది. దీనివల్ల వారికి పిల్లలు పుట్టే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
అధునాతన టెక్నాలజీతో వైద్యులు ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా తిరిగి జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి లైంగిక జీవితాన్ని సంతోషంగా గడపవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఆరోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ఎంతో కోలుకున్నాడు కూడా.
శస్త్ర చికిత్స చేయించుకున్న ఆ వ్యక్తి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాను కుంగిపోయానని, తనని తాను అంగీకరించలేకపోయానని బాధపడుతూ చెప్పారు. ఈ శస్త్ర చికిత్స తన శరీరాన్నే కాదు, తన ఆత్మవిశ్వాసాన్ని, భవిష్యత్తును కూడా ఎంతో మార్చిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాను వివాహం చేసుకునేందుకు అర్హత సాధించానని, కుటుంబం గురించి ఎంతో కలలు కంటున్నానని వివరించాడు.