Vitamin B12 : విటమిన్ B12 ను కోబాలమిన్ అని కూడా అంటారు. ఇది మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, నాడీ వ్యవస్థ ఆరోగ్యం , DNA సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరం స్వయంగా B12 ను ఉత్పత్తి చేయదు కాబట్టి, ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్ల ద్వారా దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం విటమిన్ B12 లోపం సర్వసాధారణంగా మారుతోంది. దీని లక్షణాలు గుర్తించడం ప్రారంభంలో కష్టంగా మారుతుంది. అంతే కాకుండా ఇది చివరకు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
విటమిన్ B12 లోపం యొక్క సాధారణ లక్షణాలు:
విటమిన్ B12 లోపం ఉన్నవారిలో కనిపించే లక్షణాలు వ్యక్తిని బట్టి మారతాయి. కానీ కొన్ని సాధారణ లక్షణాలు అందరిలో ఉంటాయి.
తీవ్ర అలసట, బలహీనత: ఇది B12 లోపం యొక్క అత్యంత సాధారణ లక్షణం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి B12 అవసరం. ఇవి శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. B12 లోపం వల్ల ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కాకపోతే.. ఆక్సిజన్ సరఫరా తగ్గి, అలసట, బలహీనత కలుగుతాయి.
చర్మం పాలిపోవడం : ఎర్ర రక్త కణాల లోపం వల్ల చర్మం లేతగా లేదా పసుపు రంగులోకి మారే అవకాశం కూడా ఉంటుంది.
శ్వాస ఆడకపోవడం, గుండె దడ: ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా శారీరక శ్రమ చేసేటప్పుడు.
నరాల సమస్యలు: B12 నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. దీని లోపం వల్ల చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు, మంట, సున్నితత్వం కోల్పోవడం, నడకలో సమన్వయ లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జ్ఞాపకశక్తి మందగించడం, గందరగోళం: B12 మెదడు పనితీరుకు కీలకమైనది. ఈ లోపం వల్ల జ్ఞాపక శక్తి లోపం, గందరగోళం, ఏకాగ్రత లోపం, చిరాకు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి.
నాలుక వాపు, పుండ్లు : B12 లోపం వల్ల నాలుక ఎర్రగా, వాపుగా మారి, నొప్పిగా ఉంటుంది. నోటిలో పుండ్లు కూడా సాధారణంగా వస్తుంటాయి.
ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం: కొందరిలో ఆకలి మందగించి, దానితో పాటు బరువు తగ్గడం కూడా జరగుతుంది.
కంటి సమస్యలు: అరుదుగా.. తీవ్రమైన B12 లోపం నాడీ వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా దృష్టి మసకబారడానికి దారితీస్తుంది.
Also Read: తరచుగా పన్నీర్ తింటున్నారా ? జాగ్రత్త
B12 లోపానికి కారణాలు:
శాకాహారం/వీగన్ ఆహారం: B12 ప్రధానంగా జంతు ఉత్పత్తులలో (మాంసం, చేపలు, గుడ్లు, పాలు) లభిస్తుంది కాబట్టి.. శాకాహారులు వీగన్‌లలో లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది..
జీర్ణ సమస్యలు: క్రోన్’స్ వ్యాధి, సీలియాక్ వ్యాధి, లేదా పేగు సంబంధిత సర్జరీలు B12 శోషణను అడ్డుకునే ప్రమాదం ఉంటుంది.
యాసిడ్ తగ్గించే మందులు: కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలకు మందులు వాడుతున్న వారిలో ఆమ్ల ఉత్పత్తిని తగ్గించి, B12 శోషణ ప్రభావితం అవుతుంది.
వృద్ధాప్యం: వయస్సు పెరిగే కొద్దీ B12 ను శోషించుకునే సామర్థ్యం తగ్గుతుంది.
పెర్నిషియస్ అనీమియా: ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీనిలో శరీరం B12 శోషణకు అవసరమైన “ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్” ను ఉత్పత్తి చేయదు.