ఈ రోజుల్లో హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్ గా వినిపిస్తోంది. అమెరికా, యుకె లాంటి దేశాల్లో హార్ట్ ఫెయిల్యూర్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. యుకెలో ఏడాదికి ఏకంగా 2 లక్షలకు పైగా హార్ట్ ఫెయిల్యూర్ కేసులు నమోదు అవుతున్నాయి. రక్తాన్ని పంప్ చేయగలిగే సామర్థ్యం తగ్గినప్పుడు గుండె ఆగిపోతుంది. అయితే, హార్ట్ ఫెయిల్యూర్ కు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని గమనించిన వెంటనే అలర్ట్ అయితే, ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ, చాలా మందికి నిద్రపోయే సమయంలో హార్ట్ ఫెయిల్యూర్ ఏర్పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ సమయంలో చాలా మంది స్ట్రెయిట్ గా పడుకోలేకపోతారని వెల్లడించారు.
హార్ట్ ఫెయిల్యూర్ ను సూచించే మూడు లక్షణాలు
గుండె ఆగిపోవడానికి గల కారణాల గురించి వైటాలిటీ హెల్త్ లో అసోసియేట్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రోసీ గోడెసేత్ కీలక విషయాలు వెల్లడించారు. “హార్ట్ ఫెయిల్యూర్ కు సంబంధించి వ్యక్తికి, వ్యక్తికి లక్షణాలు మారే అవకాశం ఉంది. వాటిలో ప్రధానమైనవి మూడు లక్షణాలు. కొన్నిసార్లు ప్రజలు ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడం వల్ల ధమనిలో తీవ్ర అవరోధం ఏర్పడుతుంది. ఈ సమయంలో దగ్గు ఎక్కువగా వస్తుంది. మూడు వారాలకంటే ఎక్కువ రోజులు దగ్గు ఉంటే, శ్లేష్మం గులాబీ రంగులో ఉన్నా, రక్తం వచ్చినా వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది. కాళ్లు, ముఖ్యంగా చీలమండలాల్లో వాపు ఏర్పడితే గుండె వైఫల్యానికి సంకేతంగా గుర్తించాలి. గుండె ఫెయిల్యూర్ కు ముందు బరువు పెరిగే అవకాశం ఉంది. గుండె సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రపిండాలలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా శరీరంలోని దిగువ భాగాలు వాయడంతో పాటు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మూడు లక్షణాలు హార్ట్ ఫెయిల్యూర్ కు ముందు సంకేతాలుగా గుర్తించాలి.
హార్ట్ ఫెయిల్యూర్ తప్పించుకునే మార్గాలు
❂ ఆరోగ్యకరమైన ఆహారం
తాజా కూరగాయలు, పండ్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ కు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఫైబర్ పుష్కలంగా ఉన్న ఫుడ్స్ తో హార్ట్ ఫెయిల్యూర్ సమస్య దూరం అవుతుంది.
❂ శారీరక శ్రమ
శారీరక శ్రమ అనేది చాలా వరకు గుండె సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
❂ధూమపానం, మద్యపానం మానుకోండి
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత వరకు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఈ రెండు అలవాట్లు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
❂ తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోండి
గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్థాయిలను ట్రాక్ చేయాలి. అప్పుడప్పుడు పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె సమస్యలను ముందుగా గుర్తించే అవకాశం ఉంటుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
Read Also: మధ్యాహ్నం ఆ పని చేస్తే పేగు క్యాన్సర్ రాదా? లేటెస్ట్ స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి!