Ponguleti Srinivas Reddy: నాటు బాంబు..లక్ష్మి బాంబు కాదు త్వరలో ఏకంగా ఆటం బాంబు పేలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ… గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నారని కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడతాయని అన్నారు. శ్రీనివాస్ రెడ్డి ఎవరు.? హోం మంత్రినా అని సదరు మాజీ మంత్రి మాట్లాడుతున్నాడని తాను అన్ని శాఖల గురించి మాట్లాడతానని పొంగులేటి చెప్పారు.
తప్పు చేయనందుకు కేటీఆర్ ఎందుకు బయపడుతున్నాడని వ్యాఖ్యానించారు. తాను కేటీఆర్ పేరో ఆయన బావ పేరో, వాళ్ల నాన్న పేరో తీసుకురాలేదని అన్నారు. పేదవాడికి సంబంధించిన సొత్తు ఎలా కొల్లగొట్టారో తెలుసు కాబట్టే పాదయాత్ర చేస్తామని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. పదవిలో ఉన్నప్పుడు మనిషిని మనిషిలా గౌరవించని మీకు పదవి పోయిన వెంటనే పేదవాడి కష్టం గుర్తొచ్చిందని అన్నారు. కేటీఆర్ పాదయాత్ర తమ ప్రభుత్వమే సహకరిస్తుందని తెలిపారు. ఆ పాదయాత్రకు వెళ్లినప్పుడు కొల్ల గొట్టిన లక్షకోట్ల సొత్తులో ప్రతి గ్రామపంచాయితీకి ఒక కోటినో రెండు కోట్లో ఇచ్చి శుద్ది చేసుకోవాలని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆరోపించారు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. తెలంగాణ ప్రజల నెత్తును బీఆర్ఎస్ దోచుకుందని చెప్పారు. తప్పకుండా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ధరణి పేరుతో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవలే పొంగులేటి దీపావళికి బాంబు పేలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరవాతే మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది ఇంట్లో జరుగుతున్న లిక్కర్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఇప్పుడు ఆయన ఏకంగా ఆటంబాంబే అంటున్నారు. దీంతో త్వరలో ఏం జరగబోతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.