Hotel style poori curry: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ఉదయం లేదా సెలవు రొజుల్లో బ్రేక్‌ఫాస్ట్ అనగానే చాలా మందికి టక్కున గుర్తుకు వచ్చే కాంబినేషన్ పూరి-ఆలు కుర్మా. నూనెలో చక్కగా పొంగిన వేడి వేడి పూరీని, కాస్త మసాలా దినుసులు, శనగపిండి తో చేసిన ఆలుగడ్డ కూరలో ముంచుకుని తింటుంటే.. ఆ రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే.. ఇళ్లలో చేసుకునే కూర కొన్నిసార్లు పల్చగా రావడం లేదా హోటల్ సువాసన, టేస్ట్ మిస్ అవ్వడం జరుగుతుంటుంది. కానీ కొన్ని చిన్న కిచెన్ టిప్స్ పాటిస్తూ.. పక్కా కొలతలతో చేస్తే అచ్చం హోటల్ స్టైల్ పూరీ కర్రీని మీరూ ఈజీగా వండుకోవచ్చు. ఆ రెసిపీ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఉడికించిన బంగాళదుంపలు: 4
పచ్చిమిర్చి: 5 లేదా 6
ఉల్లిపాయలు: 2 పెద్దవి
శనగపిండి : 3 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
పసుపు: అర టీస్పూన్
పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు (కలిపి 1 టీస్పూన్)
కరివేపాకు: ఒక రెమ్మ
నూనె: 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: సన్నగా తరిగినది కొద్దిగా
నీళ్లు: 2.5 గ్లాసులు
1. హోటల్ స్టైల్ కూర చిక్కగా,మంచి టెక్చర్‌తో రావడానికి శనగపిండి చాలా ముఖ్యం. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకుని, అందులో ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా ..స్పూన్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మందపాటి కడాయి.. పెట్టి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి చిటపటలాడించాలి. తర్వాత.. సన్నగా చీల్చిన పచ్చి మిర్చి, కరి వేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా.. ఎర్రగా మారకూడదు, కేవలం కాస్త సాఫ్ట్‌గా మగ్గితే సరి పోతుంది.
2. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత ఉడికించి చేత్తో కొద్దిగా నలుపుకున్న బంగాళదుంప ముక్కలను వేయాలి. దీనికి సరిపడా పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయలతో పాటు ఒక నిమిషం పాటు బాగా కలపాలి. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమంలో.. సుమారు 2 గ్లాసుల నీళ్లు పోసి బాగా కలపాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో.. మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగ పిండి నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ గరిటెతో.. తిప్పుకోవాలి. శనగపిండి కలపగానే కూర చిక్కబడటం మొదలవుతుంది. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి. కూర తగినంత చిక్కదనం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర ఆకులను చల్లుకుంటే గుమగుమలాడే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోతుంది.
ఈ పక్కా కొలతలతో చేసిన ఆలుగడ్డ కూర వేడి వేడి పూరీలతో తింటే.. అద్భుతమైన రుచిని వస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ..ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ వీకెండ్‌లో ఈ రెసిపీని ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి టేస్ట్ చేయండి!