Gaze Aversion Psychology: ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో చూపు పక్కకు తిప్పితే.. వెంటనే వారు ఏదో దాస్తున్నారని లేదా మన మాటపై ఆసక్తి లేదని అనుకోవడం సహజం. ముఖ్యంగా కష్టమైన విషయం వివరిస్తున్నప్పుడు కొందరు పైకప్పు వైపు, నేల వైపు లేదా ఖాళీ ప్రదేశం వైపు చూస్తుంటారు. అయితే, అలా చూడటం వెనుక మరో కారణం కూడా ఉండొచ్చని మనస్తత్వశాస్త్ర పరిశోధనలు చెబుతున్నాయి. కొన్నిసార్లు మనిషి చూపును పక్కకు తిప్పేది మాట తప్పించుకోవడానికి కాదు.. ఆలోచనపై పూర్తిగా దృష్టి పెట్టడానికే.
మాట్లాడేటప్పుడు మనం ఎదుటివారి ముఖాన్ని, హావభావాలను, కదలికలను గమనిస్తుంటాం. అదే సమయంలో మనసులో సమాధానం కూడా సిద్ధం చేసుకోవాలి. ఒకేసారి ఇన్ని విషయాలను గమనించడం కష్టమైన ప్రశ్న ఎదురైనప్పుడు మరింత భారంగా అనిపించవచ్చు. అందుకే కొందరు కాసేపు చూపును పక్కకు తిప్పుతారు. అలా చేయడం వల్ల చుట్టూ కనిపించే విషయాలపై దృష్టి తగ్గి, సమాధానం ఆలోచించడానికి వీలవుతుంది. పరిశోధకులు దీన్నే ‘గేజ్ అవర్షన్’ అని పిలుస్తారు.
సులభమైన ప్రశ్నలకు చాలామంది ఎదుటివారిని చూస్తూనే సమాధానం చెబుతారు. కానీ క్లిష్టమైన లెక్కలు చేయడం, ఒక సంఘటనను వివరంగా గుర్తు చేసుకోవడం లేదా పని సమస్యను వివరించడం వంటి సందర్భాల్లో చూపు పక్కకు వెళ్లొచ్చు. కొన్ని ప్రయోగాల్లో ప్రశ్న కష్టమైనకొద్దీ, పాల్గొన్నవారు ఎక్కువసార్లు చూపు తిప్పినట్టు పరిశోధకులు గమనించారు. అలా చూడటం వల్ల కొన్ని పనుల్లో సమాధానం చెప్పడం కూడా మెరుగుపడిందని అధ్యయనాలు సూచించాయి.
Also Read: మీరు కూర్చునే తీరును బట్టి మీ గుణం ఏంటో చెప్పేయొచ్చు.. ఎలాగో తెలుసా?
మూడు నెలల క్రితం జరిగిన సమావేశంలో ఏమైందని అడిగితే.. ఆ వ్యక్తి వెంటనే సమాధానం చెప్పలేకపోవచ్చు. మొదట కాసేపు ఆలోచించి, చూపును పక్కకు తిప్పి, తర్వాత వివరంగా చెప్పొచ్చు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేటప్పుడు కూడా ఇలా జరగవచ్చని ఒక అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఎక్కువ శ్రమ పడినప్పుడు చూపు పక్కకు వెళ్లే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.
కచ్చితంగా కాదు. ఒకరు చూపు కలపకపోవడానికి ఆలోచించడం, గుర్తు తెచ్చుకోవడం, సిగ్గు, ఒత్తిడి లేదా అలవాటు వంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కాబట్టి.. ఒక్క చూపు ఆధారంగా వారు అబద్ధం చెబుతున్నారని నిర్ణయించకూడదు. వారు కాసేపు పక్కకు చూసి, ఆ తర్వాత స్పష్టంగా సమాధానం ఇస్తే, అది ఆలోచించడానికి తీసుకున్న సమయం కావచ్చు. తర్వాత ఎవరైనా కష్టమైన విషయం చెబుతూ చూపు తిప్పితే వెంటనే తప్పుగా అర్థం చేసుకోకండి. కొన్నిసార్లు వారు మీ మాటను పట్టించుకోకపోవడం కాదు, మంచి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుండొచ్చు. అయితే ప్రతి ఒక్కరి అలవాటు ఒకేలా ఉండదు. అందుకే వారి మాటలు, సందర్భం, ప్రవర్తన అన్నింటినీ కలిపి చూడటం మంచిది. చూపు ఒక్కటే వారి మనసులో ఏముందో చెప్పదు.
Also Read: ధనత్రయోదశి నాడు వీటిని ఇతరులకు ఇచ్చారో.. మీ ఇంట్లోని ఐశ్వర్యం తుడిచిపెట్టుకుపోతుంది!