Same Actor Played Both Rama And Sita| ప్రస్తుతం రామాయణం కథను భారీ బడ్జెట్, అద్భత విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందించారు. ఇందులో కెజిఎఫ్ స్టార్ యష్ రావణాసురుడి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. అయితే రామాయణం కథ సినిమాగా తెరకెక్కడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు 109 ఏళ్ల క్రితమే భారతీయ ప్రేక్షకులు వెండితెరపై తొలిసారి రామాయణ ఘట్టాన్ని చూశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేదు. మరి ఆ సినిమా ఏది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసుకుందాం.
భారతీయ సినిమా చరిత్రలో దాదాసాహెబ్ ఫాల్కేకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన దర్శకత్వంలో 1917లో ‘లంకాదహన్’ అనే మూకీ సినిమా విడుదలైంది. రామాయణంలోని హనుమంతుడు లంకను దహనం చేసే ఘట్టాన్ని ఇందులో చూపించారు. ఆ కాలంలో సినిమాలకు మాటలు, నేపథ్య సంగీతం ఉండేవి కావు. నటీనటుల హావభావాలు, దృశ్యాలు, మధ్యలో కనిపించే వివరణాత్మక కార్డుల ద్వారా కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేసేవారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సుమారు 5 నిమిషాల 15 సెకన్ల ఫుటేజ్ నిడివి ఉంది.
ఆ కాలంలో ‘లంకాదహనం’ సినిమా నిర్మాణానికి సుమారు రూ.15,000 ఖర్చయినట్లు సమాచారం. అప్పటి భారతీయ సినిమా రంగానికి ఇది చాలా ఎక్కువ బడ్జెట్. మూకీ సినిమా అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 2017లో బిజినెస్ స్టాండర్డ్ ప్రచురించిన ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం.. ముంబైలోని నాజ్ టాకీస్‌లో మొదటి వారంలో సుమారు రూ.30,000 వసూలు చేసింది. మొదటి పది రోజుల్లో వసూళ్లు రూ.32,000కు చేరినట్లు ఫాల్కే పేర్కొన్నారు.
ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం నటీనటుల ఎంపిక. ఆ రోజుల్లో మహిళలు సినిమాల్లో నటించడానికి పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు. అందుకే అన్నా సాలుంకే అనే నటుడు శ్రీరాముడు, సీత పాత్రలను రెండింటినీ పోషించారు. అంతకుముందు 1913లో ఫాల్కే తెరకెక్కించిన ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాలో కూడా మహిళా పాత్రల కోసం నటీనటులను వెతకడం కష్టమైంది. తారామతి పాత్ర కోసం దర్శకుడు అన్నా సాలుంకేను చాలా కష్టపడి ఒప్పించారు. అప్పట్లో ఆయన నెలకు రూ.10 జీతంతో నటించేవార. ఫాల్కే నెలకు రూ.15 జీతం ఇస్తానని చెప్పడంతో అన్నా సాలుంకే మహిళా పాత్రకు ఒప్పుకున్నారు.
Also Read: చాణక్య నీతి.. ఈ లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండండి.. మీ మనుసుతో ఆడుకుంటారు
మహిళలు సినిమాల్లో నటించడంపై అప్పట్లో సామాజిక ఆంక్షలు ఉండేవి. అయితే ఫాల్కే తన ప్రయత్నాలను కొనసాగించారు. 1913లో ‘మోహిని భస్మాసుర’ సినిమాలో దుర్గాబాయి కామత్‌కు అవకాశం కల్పించారు. ఆమె భారతీయ సినిమాల్లో నటించిన తొలి మహిళా నటీమణిగా గుర్తింపు పొందారు.
Also Read: ఉద్యోగులకు కొత్త కంపెనీ బంపర్ ఆఫర్.. ఏ టైమ్‌లోనైనా పనిచేయండి, ఇష్టమొచ్చినప్పుడు సెలవులు
రామాయణం ఆధారంగా రూపొందిన తొలి సినిమా లంకా దహనం విడుదలైన శతాబ్దం గడిచినా ఇప్పటికీ భారతీయుల్లో రామాయణం కథపై ప్రేక్షకుల ఆసక్తి తగ్గలేదు. ఇప్పుడు దర్శకుడు నితేష్ తివారీ ఈ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఒకప్పుడు మాటలు లేని మూకీ సినిమాగా మొదలైన రామాయణం ప్రయాణం ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.