Chanagani Dayakar: తెలంగాణ రాజకీయాలు మళ్లీ తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావుల తీరుపై కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా ఎదురుదాడికి దిగింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ గులాబీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హరీష్ దుకాణం బంద్ కావాల్సిందే!
రేవంత్ రెడ్డి పాలనలో హరీష్ రావు ‘టపుకు, టమాటా’ విద్యలు ఇక నడవవని చనగాని దయాకర్ ఎద్దేవా చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట గడ్డపై కాలు పెట్టబోతున్నారన్నారు. ఆ పర్యటనతో హరీష్ రావు రాజకీయ దుకాణం బంద్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. సిద్దిపేట వేదికగానే హరీష్ రావు చేసిన అవినీతి బండారాన్ని సీఎం రేవంత్ ప్రజల ముందు ఉంచుతారని స్పష్టం చేశారు.
బావా-బామ్మర్దుల ఆధిపత్య పోరు
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు ముదిరిపోయిందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. గత ఆరు నెలలుగా మామ కేసీఆర్.. హరీష్ రావుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, దీంతో సొంత ఎజెండాతో తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలో బావా-బామ్మర్దుల ఆధిపత్యం కోసమే రైతు గర్జన పేరిట నాటకాలు ఆడుతున్నారని, రైతుల కళ్లలో రక్తం చూసిన దుర్మార్గులు ఇప్పుడు రైతు వేషాలు వేస్తే ప్రజలు నమ్మరని దుయ్యబట్టారు.
ఉద్యమకారులను ఆదుకున్నది రేవంత్ సర్కారే
తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ చెన్నైకి పారిపోయారని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులను అక్కున చేర్చుకుందని గుర్తుచేశారు. ‘కేటీఆర్కు ధైర్యముంటే తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాన్ని చూపించాలి’ అని సవాల్ విసిరారు.
BRS – BJP లాలూచీ రాజకీయం
రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు అవయవ దానం చేసుకోబోతున్నాయని, BRS నేతల అవినీతిని బీజేపీయే కాపాడుతోందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపే ఉంటారని, కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికైనా తమ డ్రామాలు ఆపాలని హెచ్చరించారు.
Also Read: కర్మభూమి ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం.. 4 బోగీల్లో ఎగిసిపడిన మంటలు!