Diwali Home Terrace Decoration| దీపావళి వచ్చిందంటే ఇంటిని అందంగా అలంకరించడం చాలామందికి ఇష్టం. అయితే ప్రతిసారీ ఇంటి లోపలే వేడుకలు చేసుకోవడం ఎందుకు? ఈసారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి టెర్రస్‌పై పార్టీ ఏర్పాటు చేయండి. చుట్టూ మెరిసే ఫెయిరీ లైట్లు, రంగురంగుల ముగ్గులు, పూల అలంకరణలు, రుచికరమైన వంటకాలతో ఆ ప్రదేశాన్ని అందమైన పార్టీ స్పేస్‌గా మార్చుకోవచ్చు. ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ ఐడియాలతో మీ టెర్రస్‌కు పండుగ కళ తీసుకురావచ్చు.
దీపావళి అలంకరణలో లైటింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. టెర్రస్‌పై పసుపు రంగు వెలుతురు ఇచ్చే ఫెయిరీ లైట్లు ఏర్పాటు చేయండి. వీటిని రెయిలింగ్స్, గోడలు, పైకప్పు అంచులకు అమర్చండి. పెద్ద మొక్కలు లేదా చెట్లు ఉంటే కొమ్మల చుట్టూ కూడా చుట్టండి. వివిధ ఎత్తుల్లో వేలాడే లైట్లు ఏర్పాటు చేస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పసుపు, తెలుపు రంగుల లైట్లను కలిపి ఉపయోగించవచ్చు.
ముగ్గు లేకుండా దీపావళి డెకరేషన్ పూర్తికాదు. టెర్రస్ మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటే పెద్ద రంగోళి వేయండి. ఎరుపు, పసుపు, గులాబీ, ఆకుపచ్చ రంగులతో అందమైన డిజైన్లు రూపొందించండి. ముగ్గు చుట్టూ చిన్న దీపాలు పెడితే మరింత అందంగా కనిపిస్తుంది. స్థలం తక్కువగా ఉంటే ఒక మూలలో చిన్న ముగ్గు వేయవచ్చు. మెట్ల దగ్గర కూడా వెల్‌కం ముగ్గు వేస్తే బాగుంటుంది.
పార్టీకి వచ్చే అతిథులు సౌకర్యంగా కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. టెర్రస్‌లో ఒక మూలను ఎంచుకుని కుర్చీలు, చిన్న సోఫాలు అమర్చండి. లేదంటే నేలపై రంగురంగుల పరుపులు, కుషన్లు వేయవచ్చు. ఎరుపు, పసుపు, గోల్డ్ రంగుల కవర్లు పండుగ వాతావరణాన్ని పెంచుతాయి. మధ్యలో చిన్న టేబుల్ పెట్టి పూలతో లేదా అలంకరణ దీపాలతో అందంగా తీర్చిదిద్దండి.
బంతి, గులాబీ పూలతో టెర్రస్‌కు సంప్రదాయ శోభ తీసుకురావచ్చు. పూల దండలను రెయిలింగ్స్, తలుపులు, గోడల అంచులకు కట్టండి. స్తంభాలు ఉంటే వాటి చుట్టూ కూడా డెకరేట్ చేయండి. పసుపు, నారింజ బంతిపూలతో ఎరుపు గులాబీలను కలిపితే అందంగా ఉంటుంది. తాజా పూలు అందుబాటులో లేకపోతే ఆర్టిఫీషియల్ పూల దండలు ఉపయోగించవచ్చు.
దీపావళి పార్టీలో స్వీట్లు, స్నాక్స్, పానీయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటి కోసం ఒక చిన్న ఫుడ్ కౌంటర్ ఏర్పాటు చేయండి. టేబుల్‌పై రంగురంగుల క్లాత్ పరిచి, వంటకాలను వేర్వేరు ప్లేట్లు, గిన్నెల్లో అమర్చండి. చిన్న పూల కుండీలు లేదా అలంకరణ లైట్లు పెడితే ఆ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. చిన్న టెర్రస్ అయితే చిన్న టేబుళ్లనే ఎంచుకోండి.
రెయిలింగ్స్, కూర్చునే ప్రదేశాల దగ్గర మట్టి దీపాలు పెట్టండి. ఖాళీ మూలల్లో అందమైన లాంతర్లు ఏర్పాటు చేయవచ్చు. అయితే దీపాలను కర్టెన్లు, కుషన్లు, పూలు వంటి మండే వస్తువులకు దూరంగా ఉంచండి. స్థిరమైన ప్రదేశాల్లోనే వెలిగించండి. ఎక్కువ మంది ఉండే ప్రాంతాల్లో బ్యాటరీతో పనిచేసే దీపాలను ఉపయోగించడం మంచిది.
Also Read: ఆఫీస్‌లో సహోద్యోగులతో స్నేహం మంచిదే.. కానీ ఈ విషయాలు మాత్రం వారికి చెప్పకూడదు
పార్టీకి వచ్చే అతిథుల కోసం అందమైన ఫొటో కార్నర్ ఏర్పాటు చేయండి. ఒక గోడను ఎంచుకుని పూలు, ఫెయిరీ లైట్లు, రంగురంగుల వస్త్రాలతో అలంకరించండి. పక్కనే చిన్న బెంచ్ లేదా కుర్చీ ఉంచండి. అతిథులు అక్కడ ఫొటోలు దిగుతూ దీపావళి జ్ఞాపకాలను పదిలం చేసుకోవచ్చు.
Also Read: చిన్న విషయాలకే మీ లవర్ కోపం తెచ్చుకుంటున్నారా? ఈ 5 టిప్స్ మీ కోసమే
టెర్రస్‌ను అలంకరించడానికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. మీకు అందుబాటులో ఉన్న స్థలం, బడ్జెట్‌కు తగ్గట్టుగా అలంకరణలు ఎంచుకోండి. లైట్లు, ముగ్గు, పూలు, సౌకర్యవంతమైన సీటింగ్‌తో అందమైన వాతావరణం సృష్టించండి. అతిథులు సులభంగా తిరిగేందుకు తగినంత ఖాళీ స్థలం ఉంచండి. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ దీపావళిని మరింత స్పెషల్‌గా జరుపుకోండి.