తండ్రీ బిడ్డ మధ్య జీవసంబంధాన్ని నిర్ధారించడానికి డిఎన్ఏ పరీక్షను ఎక్కువగా చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలతో వారికి పుట్టిన బిడ్డ తండ్రి ఎవరో నిర్ధారించవలసి వచ్చినప్పుడు ఇలా డిఎన్ఏ పరీక్షను ఎక్కువమంది కోరుతూ ఉంటారు. దీనివల్ల బిడ్డకు చట్టబద్ధమైన తల్లిదండ్రులు ఎవరో తెలుస్తుంది. అయితే మన దేశంలో డీఎన్ఏ పరీక్ష ఎలా చేయించుకోవాలో.. దానికి ఎంత ఖర్చవుతుందో నియమాలు ఏంటో తెలిసిన వారి సంఖ్య తక్కువగానే ఉంది.
డిఎన్ఏ పరీక్ష అంటే?
డిఎన్ఏ పరీక్ష అన్నది జీవసంబంధాన్ని నిర్ణయించడానికి చేసే జన్యు పరీక్ష. దీన్ని సాధారణంగా పితృత్వ పరీక్ష అని కూడా పిలుస్తారు. పిల్లలకు తండ్రి ఎవరో తేల్చి చెప్పే పరీక్ష ఇది. డిఎన్ఏ పరీక్ష చేసేటప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు. చాలా సులువుగా శాంపిల్ ను సేకరిస్తారు.
డిఎన్ఏ పరీక్ష ఎలా చేయించుకోవాలి?
డిఎన్ఏ పరీక్ష చేయించడానికి చట్టబద్ధమైన ప్రయోగశాలలను ఎంపిక చేసుకోవాలి. డిఎన్ఏ ల్యాబ్స్, ఇండియా ఈజీ డిఎన్ఏ, డిఎన్ఏ ఫర్ఎన్‌సిక్స్ లేబరేటరీ.. వంటి ల్యాబ్స్ ను ఎంపిక చేసుకోవాలి దీనికి ఎన్ఎబిఎల్ఐఎస్ఓ17025 లేదా ఏఏబిబి వంటి సంస్థల నుంచి ధ్రువీకరణ ఉండాలి.
ఈ పరీక్షను రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా మీ ఇంటికే వచ్చి శాంపుల్ ను సేకరిస్తారు. అలాగే లీగల్ పరంగా కూడా ఈ పరీక్షను చేయించుకోవచ్చు. లీగల్ టెస్ట్ కోసం కోర్టు ఆదేశాన్ని పొందాలి. మీరు సొంతంగా డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే డీఎన్ఏ హోమ్ కిట్ ను కొనుగోలు చేసుకోవాలి. కానీ చట్టబద్ధమైన పరీక్ష కోసం మాత్రం ల్యాబ్ లోనే చేయించుకోవాలి.
చీక్ స్వాబ్ టెస్టు
డిఎన్ఏ పరీక్ష కోసం చీక్ స్వాబ్ టెస్ట్ ను నిర్వహిస్తారు. అంటే ఒక వ్యక్తి బుగ్గ లోపలి భాగంలో ఉన్న కణాల నుండి డిఎన్ఏ ను సేకరిస్తారు. దీని కోసం హోమ్ కిట్ లోనే ఒక పరికరం ఉంటుంది. దానిని నోట్లో పెట్టి బుగ్గల లోపల భాగాన్ని గట్టిగా రుద్దాలి. అలా రుద్దినప్పుడు జన్యు కణాలు దానికి అతుక్కుంటాయి. దాని ద్వారా పరీక్షను ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదా చట్టపరంగా చేయాల్సి వస్తే ఒక ప్రొఫెషనల్ వైద్యులు మీకు శాంపిల్ ను సేకరిస్తారు. ల్యాబ్ లో పరీక్షించి సరైన నివేదికను అందిస్తారు.
ఎంత ఖర్చవుతుంది?
ఇంట్లోనే మీకు మీరుగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే కిట్ ను కొనాల్సి వస్తుంది. దాని ధర పదివేల రూపాయల నుంచి 15000 వరకు ఉంటుంది. అదే చట్టపరంగా పితృత్వ పరీక్ష చేయించాలనుకుంటే 21 వేల రూపాయల నుంచి 26 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.
ఎంపిక చేసుకున్న ల్యాబ్ ను బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. సాధారణంగా ఈ లీగల్ టెస్ట్ ఫలితాలు రావడానికి నాలుగు నుంచి పది రోజులు పడుతుంది. అదే ఇంట్లోనే చేసుకునే వ్యక్తిగత పరీక్షలో ఫలితాలు రావడానికి ఒక రోజు నుంచి వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది.
చట్టపరమైన లీగల్ పరీక్ష కోసం తల్లిదండ్రుల సమ్మతి అవసరం. కోర్టు ఆదేశం కూడా ఉండాలి. పిల్లల ను ఇబ్బంది పెట్టకుండా గోప్యంగా ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
పిల్లలకు డిఎన్ఏ పరీక్ష చేయడం చట్టబద్ధమేనా?
మనదేశంలో పిల్లలకు డిఎన్ఏ పరీక్షలు చేయడం అన్నది చట్టబద్ధమే. పిల్లలకు తండ్రి ఎవరో తేల్చేందుకు ఇలాంటి పరీక్షలు సురక్షితమైనవి, చట్టబద్ధమైనవి కూడా. గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో డీఎన్ఏ పరీక్షలను చేయిస్తారు. ఆ నివేదికలనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది.