Pigeon Control: ప్రస్తుతం నగరాల్లో పావురాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు వీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాల్కనీలు, ఇంటి డాబాలు, పరిసర ప్రాంతాల్లో పావురాల రెట్టల వల్ల అపరిశుభ్రత ఏర్పడటమే కాకుండా.. శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే కొన్ని సులువైన పద్దతులు పాటించడం ద్వారా పావురాల సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పావురాలు తమ ఆత్మరక్షణ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటాయి. తమకు ప్రత్యర్థిగా భావించిన వాటికి ఎల్లప్పుడూ దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. ఈ లెక్కన చూస్తే డేగలు, గద్దలు, గూడ్లగూబల వంటి వేటాడే పక్షులంటే పావురాళ్లకు విపరీతమైన భయం. అలాగే కాంతిని పరావర్తం చేసే మెరుపులు కంట పడినా కూడా అవి బెదిరిపోతాయి. బిగ్గరగా వచ్చే వింత శబ్దాలు, చప్పుడు సైతం వాటిని దిగ్బ్రాంతికి గురిచేస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పావురాళ్ల భయాలను ఆయుధంగా చేసుకొని కొన్ని చిట్కాలు పాటిస్తే వాటికి ఈజీగా చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వారి ప్రకారం.. ఇందుకోసం బాల్కనీలు, కిటికీల వద్ద ప్లాస్టిక్ గుడ్లగూబలు, డేగ బొమ్మలు ఉంచితే పావురాళ్లు అక్కడికి రావడానికి భయపడతాయి. అలాగే కిటికీలు, బాల్కనీలకు బర్డ్ నెట్స్ కట్టడం, పావురాలు వాలే గోడల అంచులపై ప్లాస్టిక్ లేదా స్టీల్ స్పైక్స్ (Spikes) అమరిస్తే వాటిని అడ్డుకోవచ్చు. పాత సీడీలు, మెరిసే రేకులను బాల్కానీలు, కిటికీలకు కట్టి వేలాడదీస్తే వాటి మెరుపులకు పావురాలు భయపడే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు.
Also Read: తెలంగాణ, ఏపీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్లు!
పావురాలకు వాసన శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని పక్షుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. ఫలితంగా ఘాటైన వాసనలను అవి అస్సలు తట్టుకోలేవని పేర్కొంటున్నారు. నల్ల మిరియాల పొడి, కారం పొడి చల్లిన ప్రదేశాల్లో పావురాలు అస్సలు వాలవని పేర్కొంటున్నారు. అలాగే వెనిగర్, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని స్ప్రే చేస్తే ఆ వాసనకు పావురాలు దూరంగా పారిపోతాయని తెలియజేస్తున్నారు. పుదీనా నూనె, దాల్చినచెక్క నూనె, యూకలిప్టస్ నూనె, లవంగ నూనె ఘాటైన వాసనలన్నా పావురాలకు పడవట. నాఫ్తలీన్ గోళీలు సైతం పావురాలను అసౌకర్యానికి గురిచేస్తాయని చెబుతున్నారు.
Also Read: అమెజాన్ దీపావళి ధమాకా.. రూ. 20 వేలలో 43 అంగుళాల 4K స్మార్ట్ టీవీలు.. ఇది కదా పండగ ఆఫరంటే!