Vegetable Spring Rolls: పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏదైనా చేసి పెట్టమని అడుగుతుంటారు. అలాంటి సమయంలో ఎక్కువ పదార్థాలు అవసరం లేకుండా చాలా తక్కువ సమయంలో చేసుకునేలా బెస్ట్ స్నాక్ ఐటమ్ ఏదైనా ఉందంటే.. అది ‘వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్’. బయట పలుచగా, బంగారు రంగులో కరకరలాడుతూ.. లోపల రుచికరమైన కూరగాయల మిశ్రమంతో ఉండే ఈ స్ప్రింగ్ రోల్స్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి. సాయంత్రం టీతో పాటు సర్వ్ చేయడానికి, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు స్నాక్‌గా పెట్టడానికి కూడా సరిపోతాయి. ముఖ్యంగా ఇంట్లో అందుబాటులో ఉండే కూరగాయలతోనే వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు.
స్ప్రింగ్ రోల్ షీట్లు – 8, క్యాబేజీ తరుగు – ఒక కప్పు, క్యారెట్ తరుగు – అర కప్పు, క్యాప్సికమ్ తరుగు – అర కప్పు, ఉల్లిపాయ – ఒకటి, పచ్చిమిర్చి – 2, అల్లం తురుము – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, మొక్కజొన్న పిండి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా, మైదా – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – తయారీకి సరిపడా.
Also Read: రెస్టారెంట్ స్టైల్ హనీ చిల్లీ పొటాటో సీక్రెట్ రెసిపీ.. ఈ ఒక్క చిట్కా తెలిస్తే చాలు!
ఒక గిన్నెలో ముందుగా మైదా తీసుకుని కొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కటి పేస్ట్‌లా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది స్ప్రింగ్ రోల్స్ చివర్లు అంటించడానికి ఉపయోగపడుతుంది.
ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి వేయించాలి. ఆ తర్వాత క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ వేసి ఎక్కువసేపు కాకుండా రెండు మూడు నిమిషాలు వేయించాలి. కూరగాయలు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా క్రంచీగా ఉండేలా చూసుకోవాలి.
ఇందులో సోయా సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా మొక్కజొన్న పిండి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇప్పుడు స్ప్రింగ్ రోల్ షీట్ తీసుకుని ఒక చివరలో కూరగాయల మిశ్రమాన్ని పెట్టాలి. రెండు పక్కల అంచులను లోపలికి మడిచి, గట్టిగా రోల్ చేయాలి. చివరి అంచుకు ముందుగా తయారు చేసుకున్న మైదా పేస్ట్ రాసి అంటించాలి. ఇలా మిగిలిన షీట్లతో కూడా తయారు చేసుకోవాలి.
తర్వాత కడాయిలో నూనె వేడి చేసి రోల్స్‌ను మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. బయటకు తీసి టిష్యూ పేపర్‌పై ఉంచుకుని సర్వ్ చేసుకుంటే సరి.
Also Read: పిల్లలు కూడా ఇష్టంగా తినే మష్రూమ్ ఫ్రైడ్ రైస్.. తయారీ చాలా సులభం!