Google Pay Discover Shop: సాధారణంగా ఆన్‌లైన్‌లో బట్టలు షాపింగ్ చేసేటప్పుడు ‘ఫొటోలో ఈ డ్రెస్ భలే ఉంది కానీ, నాకు సెట్ అవుతుందో లేదో?’ అనే అనుమానం మనలో చాలామందికి వస్తుంటుంది. దీంతో కొన్నిసార్లు ఆర్డర్ చేశాక సెట్ కాక రిటర్న్ పెట్టే తిప్పలు తప్పవు. ఇప్పుడీ సమస్యకే చెక్ పెడుతూ గూగుల్ ఒక మైండ్ బ్లోయింగ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది.
ఇకపై నేరుగా గూగుల్ పే (Google Pay)లోనే ‘డిస్కవర్ షాప్’ పేరుతో ఫ్యాషన్ షాపింగ్ చేయవచ్చు. ఇందులో ఉన్న ఏఐ సాయంతో నచ్చిన డ్రెస్‌ను కొనకముందే మనపై ఎలా ఉంటుందో వర్చువల్‌గా వేసుకుని చూసుకోవచ్చు. అంతేకాదు.. మనకు నచ్చిన డ్రెస్ ఫొటో అప్‌లోడ్ చేస్తే చాలు.. అలాంటి మోడల్స్‌ను వెతికి మరీ చూపుతుంది. ప్రస్తుతం భారత్‌లో కొందరు ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.
గూగుల్ పేలో ప్రత్యేకంగా కనిపించే Discover Shop విభాగంలో ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్‌ను చూడొచ్చు. గూగుల్‌కు చెందిన షాపింగ్ గ్రాఫ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇందులో 60 బిలియన్లకు పైగా ప్రొడక్ట్స్‌కు సంబంధించిన సమాచారం ఉంది. యూజర్లు గతంలో చూసిన వస్తువులు, వారి ఆసక్తులు, ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ఫ్యాషన్ ఆధారంగా ప్రొడక్ట్స్‌ను చూపిస్తుంది. ఇందుకోసం యూజర్ల అనుమతితో Web and App Activity, Search Personalisation సెట్టింగ్స్‌ను ఉపయోగిస్తుంది.
ఈ ఫీచర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏఐ వర్చువల్ ట్రై-ఆన్. ఆన్‌లైన్‌లో నచ్చిన డ్రెస్ కనిపిస్తే.. దాన్ని మనపై ఎలా ఉంటుందో వర్చువల్‌గా చూసుకోవచ్చు. దీంతో కొనుగోలు చేసే ముందు ఆ దుస్తుల లుక్‌పై ఒక అంచనాకు రావచ్చు. అంతేకాదు, త్వరలో రోజువారీ అవుట్‌ఫిట్ సలహాలను కూడా తీసుకొచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది.
ఎక్కడైనా నచ్చిన డ్రెస్ కనిపిస్తే దాని ఫొటో తీసి లేదా గ్యాలరీ నుంచి అప్‌లోడ్ చేసి సెర్చ్ చేయొచ్చు. దానికి దగ్గరగా ఉండే డిజైన్లను వెబ్‌లో వెతికి చూపిస్తుంది. నచ్చిన ప్రొడక్ట్‌పై క్లిక్ చేస్తే రంగులు, సైజులు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.
Discover Shop ప్రస్తుతం భారత్‌లో ఎంపిక చేసిన గూగుల్ పే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యాప్‌ను అప్‌డేట్ చేసి కింద కనిపించే డిస్కవర్ ఐకాన్‌ను చెక్ చేయొచ్చు. దీని కోసం వ్యక్తిగత గూగుల్ అకౌంట్‌తో పాటు Web and App Activity, Search Personalisation ఆన్‌లో ఉండాలి. అయితే ఈ ఫీచర్‌లో నేరుగా డబ్బులు చెల్లించి కొనుగోలు చేసే అవకాశం లేదు. ప్రొడక్ట్ నచ్చితే సంబంధిత షాపింగ్ వెబ్‌సైట్‌కు వెళ్తారు. అక్కడే ఆర్డర్ పూర్తి చేయాలి. అందరికీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంపై గూగుల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
Also Read: బ్యాటరీ పాడైందని కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే మార్చుకోండిలా!