Creamy Mushroom Pasta: పాస్తా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. ముఖ్యంగా క్రీమీ సాస్‌తో, మృదువైన మష్రూమ్స్ కలిపి తయారు చేసే పాస్తా రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెస్టారెంట్లలో ఎంతో ఇష్టంగా తినే ఈ క్రీమీ మష్రూమ్ పాస్తాను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా.. వంటింలో ఉండే పదార్థాలతోనే రుచికరమైన వంటకాన్ని సిద్ధం చేసుకోవచ్చు. సాయంత్రం వేళ పిల్లలకు స్నాక్‌గా, వీకెండ్‌లో ప్రత్యేకమైన బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా రాత్రి భోజనంలోనూ ఈ పాస్తాను చేసుకోవచ్చు. మష్రూమ్స్ రుచి, వెల్లుల్లి సువాసన, క్రీమ్‌తో కలిసిన సాస్ ప్రతి ముద్దను ఎంతో రుచిగా మారుస్తాయి.
పాస్తా – 200 గ్రాములు
మష్రూమ్స్ – 200 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు – 5
ఉల్లిపాయ – ఒకటి
వెన్న – 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్ – ఒక టేబుల్ స్పూన్
ఫ్రెష్ క్రీమ్ – అర కప్పు
పాలు – అర కప్పు
చీజ్ తురుము – పావు కప్పు
మిరియాల పొడి – అర టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ – అర టీస్పూన్
ఒరేగానో – అర టీస్పూన్
ఉప్పు – తగినంత
నీళ్లు – తగినన్ని
ఒక గిన్నెలో సరిపడా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి పాస్తాను అందులో వేయాలి. పాస్తా మెత్తగా ఉడికిన తర్వాత నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. పాస్తా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
ఇప్పుడు మష్రూమ్స్‌ను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక పాన్‌లో వెన్న, ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేయాలి. అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత మష్రూమ్స్ వేసి వాటిలోని నీరు ఆవిరయ్యే వరకు వేయించాలి.
ఇప్పుడు ఇందులో పాలు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలపాలి. చీజ్ తురుము, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో వేసి సాస్ చిక్కబడే వరకు ఉడికించాలి. చివరగా ఉడికించిన పాస్తాను వేసి సాస్ అంతా పట్టేలా కలపాలి. రెండు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
అంతే.. ఎంతో రుచికరమైన క్రీమీ మష్రూమ్ పాస్తా రెడీ. పైన కొద్దిగా చీజ్ తురుము, ఒరేగానో చల్లి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అచ్చం రెస్టారెంట్ రుచిని ఆస్వాదించవచ్చు.