Muse AI Spaces Feature: ఏఐ రంగంలో రోజురోజుకీ కొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే తమ మ్యూస్ ఏఐ (Muse AI) యాప్‌లో మ్యూస్ వాయిస్ (Muse Voice) ఫీచర్‌ను తీసుకొచ్చిన మెటా.. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరే ‘స్పేసెస్’ (Spaces). యూజర్లకు నచ్చిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట చూపించడంతో పాటు, వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేకమైన ఫీడ్స్‌ను తయారు చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. అంతేకాదు.. చిన్న చిన్న గేమ్స్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చని మెటా చెబుతోంది.
మ్యూస్ స్పేసెస్ అనేది మెటా Muse AI యాప్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్. దీని సాయంతో యూజర్లు తమకు ఆసక్తి ఉన్న అంశాల కోసం ప్రత్యేకమైన స్పేస్‌లను తయారు చేసుకోవచ్చు. సాధారణంగా సోషల్ మీడియా ఫీడ్స్‌లో రకరకాల సమాచారం కనిపిస్తుంది. కానీ ఇందులో మాత్రం మనకు కావాల్సిన సమాచారం, మనం కోరుకున్న ఫార్మాట్‌లోనే చూసే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత పనులు, రోజువారీ అలవాట్లు, లక్ష్యాలు, ప్రాజెక్టుల వివరాలను ఒకే చోట ట్రాక్ చేయవచ్చు.
ఈ ఫీచర్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..తయారు చేసుకున్న స్పేసెస్‌ను మనకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాటిని సైడ్‌బార్ నుంచి ప్రధాన ట్యాబ్స్‌లోకి మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఏ పనిపై ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నామో దానికి సంబంధించిన స్పేస్‌ను ముందుకు తెచ్చుకోవచ్చు. అవసరం లేనప్పుడు దాన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా యాప్‌ను మన పనులకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు.
Also Read: వాట్సప్‌లో క్రేజీ అప్‌డేట్.. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను కూడా ఇక్కడికి రప్పించొచ్చు, ఎలాగో తెలుసా?
స్పేసెస్‌తో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో సేవ్ చేసుకున్న వస్తువులు, మార్కెట్‌ప్లేస్ లిస్టింగ్స్‌తో ప్రత్యేకమైన షాపింగ్ హబ్ తయారు చేసుకోవచ్చు. స్కూల్‌కు సంబంధించిన ఈ-మెయిల్స్‌లోని ఈవెంట్స్‌ను గుర్తించి, వాటితో క్యాలెండర్ తయారు చేసుకోవచ్చు. చిన్న వ్యాపారులు ఆర్డర్లు, మెసేజ్‌ల వివరాలను ఒకేచోట చూసుకునేలా ట్రాకర్‌ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
సినిమాలు, పాటలు, ఇష్టమైన స్పోర్ట్స్ టీమ్స్ ఆధారంగా ట్రివియా గేమ్స్‌ను తయారు చేసుకోవడం కూడా ఇందులో సాధ్యమే. యూజర్లు వాడే ఇతర యాప్‌లను కనెక్ట్ చేసుకుని, వాటి నుంచి సమాచారాన్ని తీసుకొచ్చేలా స్పేసెస్‌ను మెటా రూపొందిస్తోంది. దీంతో ఫీడ్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటాయి. భవిష్యత్తులో తమ Spacesను ఇతరులతో షేర్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకురావాలని మెటా భావిస్తోంది. అయితే ఈ ఫీచర్ అందరికీ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే వివరాలు ఇంకా స్పష్టంగా లేవు.
Also Read: సబ్‌స్క్రిప్షన్ ఖర్చులకు చెక్ పెట్టే 4 బెస్ట్ యాప్స్.. నెలకు ఎంత ఆదా చేయవచ్చో తెలుసా?