Best European Cities for Solo Travel: సోలోగా ట్రావెల్ చేయాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఎవరితోనూ సంబంధం లేకుండా, నచ్చిన ప్రదేశంలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ, మనకు నచ్చినట్లు టూర్ ఎంజాయ్ చెయ్యొచ్చు. అయితే, సోలో ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు సేఫ్టీ, స్టే, ఖర్చు లాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా యూరప్‌లో ఒంటరిగా పర్యటించాలనుకునే వారికి టాప్ 10 సిటీస్ గురించి తెలుసుకుందాం..
లగేజీ స్టోరేజ్ సర్వీసుల సంస్థ రాడికల్ స్టోరేజ్ తాజాగా సోలో ట్రావెల్ ఇండెక్స్ ను విడుదల చేసింది. యూరప్‌లోని 48 టాప్ సిటీస్ ను పరిశీలించి, ఒంటరిగా ప్రయాణించేవారికి అనువైన టాప్ 10 సిటీస్ ను ప్రకటించింది. ఈ లిస్టులో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ ఫస్ట్ ప్లేస్ ను దక్కించుకుంది. ప్రేగ్ లో మిడ్ రేంజ్ ట్రావెల్ కు రోజుకు సుమారు 134.33 యూరోలు ఖర్చవుతుందని అంచనా. ఇక్కడి పురాతన భవనాలు, గోతిక్ నిర్మాణాలు, అందమైన వంతెనలు, సందడిగా ఉండే వీధులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. నగరంలోని చాలా ప్రాంతాలను నడుచుకుంటూ కూడా చూడవచ్చు.
పోలాండ్ లోని క్రాకోవ్ రెండో స్థానంలో నిలిచింది. తక్కువ ఖర్చుతో యూరప్ అందాలను చూడాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. చారిత్రక పాత పట్టణం, కొండపై ఉన్న కోట, చిన్న కేఫ్‌లు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. టర్కీలోని ఇస్తాంబుల్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ నగరంలో హాస్టల్ వసతి ఖర్చులు చాలా తక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. రద్దీగా ఉండే బజార్లు, బోస్ఫరస్ జలసంధిలో ఫెర్రీ ప్రయాణాలు, లేస్టీ స్ట్రీట్ ఫుడ్ ఇస్తాంబుల్ ప్రత్యేకతలు.
ఈ లిస్టులో పోర్చుగల్, పోలాండ్ దేశాలకు చెందిన రెండేసి నగరాలు ఉన్నాయి. స్పెయిన్ నుంచి కూడా రెండు నగరాలు చోటు సంపాదించుకున్నాయి.
1.ప్రేగ్ – చెక్ రిపబ్లిక్
2.క్రాకోవ్ – పోలాండ్
3.ఇస్తాంబుల్ – టర్కీ
4.లిస్బన్ – పోర్చుగల్
5.గ్డాన్స్క్ – పోలాండ్
6.బెర్లిన్ – జర్మనీ
7.పోర్టో – పోర్చుగల్
8.సెవిల్ – స్పెయిన్
9.బార్సిలోనా – స్పెయిన్
10.రీగా – లాట్వియా
లిస్బన్, పోర్టో సిటీలు కలర్ ఫుల్ స్ట్రీట్స్, అందమైన భవనాలకు ప్రసిద్ధి. గ్డాన్స్క్‌లో బాల్టిక్ సముద్ర తీర అందాలు ఆకట్టుకుంటాయి. సెవిల్‌లో ఎండతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం, బార్సిలోనాలో చారిత్రక కట్టడాలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి.
రాడికల్ స్టోరేజ్ మొత్తం 11 అంశాలను పరిగణనలోకి తీసుకుంది. రోజువారీ ప్రయాణ ఖర్చు, సేఫ్టీ, హాస్టళ్ల సంఖ్య లాంటి అంశాలను పరిశీలించింది. ఒక్కో అంశానికి ఒకటి నుంచి పది వరకు స్కోరు ఇచ్చి, వాటి సగటు ఆధారంగా తుది ర్యాంకులను ప్రకటించింది. మీ బడ్జెట్‌కు, ఇంట్రెస్టుకు సరిపోయే సిటీని ఎంచుకుని సోలో ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
Read Also: బ్రేకప్ కోసం హైకింగ్.. దెయ్యాల కోసం వేట.. 2027లో రాబోతున్న 6 వింత ట్రావెల్ ట్రెండ్స్!