Dating App Marriage Refund Offer| డేటింగ్ యాప్స్‌లో ఎంతమందితో మాట్లాడినా సరైన జీవిత భాగస్వామి దొరకడం లేదా? స్వైపింగ్‌లు, చాటింగ్‌లు, వరుసగా విఫలమవుతున్న పరిచయాలతో విసిగిపోయారా? అయితే ఓ డేటింగ్ యాప్ కంపెనీ వినూత్న ఆఫర్ తీసుకొచ్చింది. తమ యాప్‌లో చేరిన మూడేళ్లలో పెళ్లి కాకపోతే సభ్యత్వం కోసం చెల్లించిన డబ్బు మొత్తాన్ని తిరిగి ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు, ఒకేసారి ఒక్కరితో మాత్రమే పరిచయం పెంచుకునే అవకాశం కల్పిస్తోంది.
చైనాకు చెందిన లియాంగ్‌పెయ్ ఏఐ (Liangpei AI) అనే మ్యాచ్ మేకింగ్ స్టార్టప్ ఈ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఈ యాప్‌లో వార్షిక సభ్యత్వ రుసుము (సబ్‌స్క్రిప్షన్) 2,000 యువాన్లు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.28,155.
ఈ సభ్యత్వం తీసుకున్నవారు మూడేళ్లలో పెళ్లి చేసుకోలేకపోతే చెల్లించిన సభ్యత్వ మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. సాధారణ డేటింగ్ యాప్స్‌లా ఒకేసారి చాలామందితో మాట్లాడే అవకాశం కాకుండా, ఒక సమయంలో ఒక్కరితోనే పరిచయం పెంచుకునే విధానాన్ని అమలు చేస్తోంది.
దీంతో ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, బంధాన్ని బలపరచుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుందని కంపెనీ భావిస్తోంది.
లియాంగ్‌పెయ్ ఏఐని జెంగ్ జిన్‌షున్ ప్రారంభించారు. గతంలో ఆయన మూన్‌షాట్ ఏఐలో ఏఐ సెర్చ్ టెక్నాలజీ విభాగంలో పనిచేశారు. ఈ యాప్‌లో చేరిన కొత్త సభ్యులతో ముందుగా ఏఐ సిస్టమ్ సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడుతుంది. ఈ సంభాషణ ఆధారంగా వారి కుటుంబ నేపథ్యం, చదువు, ఉద్యోగం, ఆసక్తులు, వ్యక్తిత్వం, జీవనశైలి వంటి వివరాలతో ప్రొఫైల్ రూపొందిస్తుంది.
అలాగే తమకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను కూడా తెలుసుకుంటుంది. వీటి ఆధారంగా సరైన జోడీ సూచిస్తుంది.
ఈ యాప్‌లో ఏఐ స్ట్రాటజిస్ట్ అనే మరో ప్రత్యేక ఫీచర్ కూడా ఉంది. ఇది ఇద్దరి ప్రొఫైల్స్, సంభాషణలను పరిశీలించి సంబంధంలో ఎదురయ్యే సమస్యలను అంచనా వేస్తుంది. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో సూచనలు అందిస్తుంది.
ఈ ప్లాట్‌ఫామ్‌కు ఇప్పటికే 35,000 మందికి పైగా రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నట్లు సమాచారం. సుమారు 9 శాతం కన్వర్షన్ రేటు నమోదైంది. ఈ స్టార్టప్‌కు 15 మిలియన్ యువాన్ల ఏంజెల్ ఫండింగ్ కూడా లభించింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.21.11 కోట్లు.
మరోవైపు సింగపూర్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన డేటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక డేటింగ్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంది.
దేశంలో తగ్గుతున్న జననాల రేటు సమస్యకు పరిష్కారంగా కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఒక కారణంగా భావిస్తున్నారు. 2025లో సింగపూర్‌లో 30 వేల కంటే తక్కువ జననాలు నమోదయ్యాయి. ఇది 6 దశాబ్దాల్లోనే అత్యల్ప సంఖ్య. దేశంలో సంతానోత్పత్తి రేటు కూడా ప్రతి మహిళకు 0.87కు పడిపోయింది.
Also Read: పిల్లల ప్రవర్తనలో ఈ 5 సంకేతాలు కనిపిస్తే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నట్లే..
ప్రస్తుతం డేటింగ్ యాప్స్ కేవలం పరిచయాలకే పరిమితం కాకుండా, శాశ్వత సంబంధాలను ఏర్పరచడంపై దృష్టి పెడుతున్నాయి. చైనాలో డబ్బు తిరిగి ఇచ్చే హామీ, సింగపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక యాప్ ఇందుకు ఉదాహరణలు. అయితే ఈ ప్రయోగాలు ఎంతవరకు విజయవంతమవుతాయో, నిజంగా ఎంతమందికి జీవిత భాగస్వాములను అందిస్తాయో చూడాలి.