Kaju Chicken Fry: చికెన్‌తో ఎన్ని రకాల వంటకాలు చేసినా నాన్‌వెజ్ ప్రియులకు ఎప్పుడూ కొత్త రుచులు కావాల్సిందే. అలాంటివారి కోసం మంచి రుచితో పాటు నోటికి కమ్మగా ఉండే వంటకం కాజూ చికెన్ ఫ్రై. జీడిపప్పు రుచితో, మసాలాల ఘాటుతో తయారయ్యే ఈ చికెన్ ఫ్రై వేడి వేడి అన్నంలోనే కాదు.. చపాతీ, రోటీల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా జీడిపప్పును మెత్తగా గ్రైండ్ చేసి చికెన్‌లో కలపడం వల్ల కూరకు మంచి చిక్కదనం వచ్చి, ప్రతి చికెన్ ముక్కకు మసాలా చక్కగా పడుతుంది. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రుచిని ఆస్వాదించాలనుకుంటే ఈ కాజూ చికెన్ ఫ్రైని తప్పకుండా ప్రయత్నించండి.
చికెన్ – అర కిలో
జీడిపప్పు – 20
ఉల్లిపాయలు – 2
టమోటాలు – 2
పచ్చిమిర్చి – 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 స్పూన్లు
కారం – 2 స్పూన్లు
ధనియాల పొడి – 1 స్పూన్
గరం మసాలా – 1 స్పూన్
పసుపు – అర స్పూన్
జీలకర్ర – అర స్పూన్
నూనె – 4 స్పూన్లు
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – తగినంత
Also Read: పిల్లలకు క్యారెట్ తినిపించడం ఇక ఈజీ.. ఇలా టేస్టీ రోల్స్ చేసి పెట్టండి!
జీడిపప్పును కొద్దిసేపు వేడి నీళ్లలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
తర్వాత చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి మధ్యస్థ మంటపై ఉడికించాలి. చికెన్ నుంచి నీరు బయటకు వచ్చాక కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. చికెన్ దాదాపుగా ఉడికిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి చికెన్ పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి. చివరగా నూనె పైకి తేలుతూ చికెన్ ముక్కలకు మసాలా చక్కగా పట్టిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.
Also Read: తీపి, కారం కలయికతో నోరూరించే చిలగడదుంప పచ్చడి.. పిల్లల కూడా తెగ ఇష్టంతో తినేస్తారు!