Simple office makeup tips| ఉదయం లేవగానే ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, వంట, ఆఫీసుకు వెళ్లే హడావుడి.. ఇలా పని చేసే మహిళలకు సమయం ఎప్పుడు గడిచిపోతుందో కూడా తెలియదు. ఇంత బిజీగా ఉన్నప్పుడు చక్కగా రెడీ అవ్వడానికి సమయం దొరకడం చాలా కష్టం. ఏ బట్టలు వేసుకోవాలి? జుట్టును ఎలా సెట్ చేసుకోవాలి? మేకప్ కోసం ఎంత సమయం కేటాయించాలి? అనే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అయితే కొన్ని చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే ఉదయం టెన్షన్ తగ్గించుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లో నీట్‌గా, స్టైలిష్‌గా ఆఫీసుకు వెళ్లేందుకు ఈ సింపుల్ టిప్స్ ఉపయోగపడతాయి.
ఉదయం ఏం వేసుకోవాలో ఆలోచిస్తూ సమయం వృథా చేయకండి. మరుసటి రోజు ధరించాల్సిన దుస్తులను రాత్రే ఎంచుకుని పెట్టుకోండి. వాటికి సరిపోయే చెప్పులు, హ్యాండ్‌బ్యాగ్ కూడా సిద్ధం చేసుకోండి. అవసరమైతే ముందుగానే ఇస్త్రీ చేసుకోవాలి. ఇలా చేస్తే ఉదయం హడావుడి తగ్గుతుంది.
ఆఫీసుకు వెళ్లే ముందు చర్మ సంరక్షణ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ముందుగా ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుని, చివరగా సన్‌స్క్రీన్ అప్లై చేయండి. ఈ చిన్న రొటీన్‌తో చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.
జుట్టు సెట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంటే సింపుల్ హెయిర్ స్టైల్స్ ప్రయత్నించండి. లో బన్, పోనీటెయిల్ లేదా క్లచర్‌తో జుట్టు సర్దుకోవచ్చు. ఇవి తక్కువ సమయంలో పూర్తవుతాయి. ఆఫీస్ దుస్తులకు కూడా చక్కగా సరిపోతాయి.
రోజూ ఆఫీసుకు వెళ్లేటప్పుడు హెవీ మేకప్ అవసరం లేదు. కొద్దిగా కన్సీలర్, కాటుక, లిప్ బామ్ లేదా లిప్‌స్టిక్ ఉపయోగించండి. అవసరమైతే లైట్ కాంపాక్ట్ పౌడర్ కూడా అప్లై చేయండి. ఇలా చేస్తే తక్కువ సమయంలోనే ఫ్రెష్ లుక్ పొందవచ్చు.
ఉదయం ఐడీ కార్డు, పర్సు, ఛార్జర్ కోసం వెతుకుతూ సమయం వృథా చేయకండి. రాత్రే అవసరమైన వస్తువులను బ్యాగ్‌లో పెట్టుకోండి. ముఖ్యమైన పత్రాలు, ఇతర వస్తువులు కూడా సర్దిపెట్టండి. దీంతో ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు హడావుడి ఉండదు.
రోజూ కొత్తగా ఏం వేసుకోవాలో ఆలోచించకుండా కొన్ని కంఫర్టబుల్ దుస్తులు సిద్ధంగా ఉంచుకోండి. కుర్తీతో ప్యాంట్, షర్ట్‌తో ట్రౌజర్ లేదా సింపుల్ సూట్స్ ఎంచుకోవచ్చు. వీటిని వారంలో వేర్వేరు రోజులు ధరించవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది.
సింపుల్ దుస్తులకు చిన్న యాక్సెసరీస్ జోడిస్తే అందంగా కనిపించవచ్చు. వాచ్, స్టడ్ ఇయర్ రింగ్స్ లేదా సన్నని చైన్ ఎంచుకోండి. వీటిని ధరించడానికి ఎక్కువ సమయం పట్టదు. రోజూ ఉపయోగించే ఆభరణాలను ఒకే చోట పెట్టుకోండి.
Also Read: పెళ్లి రోజు వధువు అందంగా, ఆరోగ్యంగా కనిపించాలా? వారం రోజులు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కోంబ్, హెయిర్ క్లిప్స్, లిప్‌స్టిక్, సన్‌స్క్రీన్ వంటి వస్తువులు ఒకే చోట పెట్టుకోండి. వీటి కోసం వేర్వేరు చోట్ల వెతకాల్సిన అవసరం ఉండదు. చిన్న ఆర్గనైజర్ ఉపయోగిస్తే అన్ని వస్తువులు సులభంగా అందుబాటులో ఉంటాయి.
Also Read: పెళ్లిళ్లు, పార్టీల్లో అదిరిపోయే లుక్ కావాలా? లెహంగాతో ఈ 6 హెయిర్‌స్టైల్స్ ట్రై చేయండి
ఆఫీసుకు వెళ్లే ముందు ఎక్కువ సమయం అద్దం ముందు గడపాల్సిన అవసరం లేదు. రాత్రే దుస్తులు, బ్యాగ్ సిద్ధం చేసుకోవడం అలవాటు చేసుకోండి. సింపుల్ స్కిన్ కేర్, తక్కువ మేకప్, సులభమైన హెయిర్ స్టైల్స్ ఎంచుకోండి. ఈ చిన్న చిట్కాలతో తక్కువ సమయంలోనే నీట్‌గా, అందంగా రెడీ అవ్వండి. ఇలా ఉదయం ఒత్తిడి తగ్గించుకుంటే ఆ రోజు ఉత్సాహంగా సాగుతుంది.