Chilakada Dumpa Pachadi: చిలగడదుంప అనగానే చాలామందికి ఉడికించి తినడమే గుర్తొస్తుంది. కానీ అదే చిలగడదుంపతో ఎంతో రుచికరమైన పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కాస్త తీపి రుచి, పులుపు, కారం కలిసిన ఈ చిలగడదుంప పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకే రకమైన పచ్చళ్లు తిని బోర్ కొట్టినప్పుడు ఈ కొత్త రుచిని తప్పకుండా ప్రయత్నించండి. మన వంటింట్లో ఉండే పదార్థాలతోనే ఈ పచ్చడిని తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ రుచికరమైన పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా..
చిలగడదుంపలు – 2
టమోటాలు – 2
పచ్చిమిర్చి – 4
చింతపండు – చిన్న నిమ్మకాయంత
వెల్లుల్లి రెబ్బలు – 5
జీలకర్ర – అర టీస్పూన్
ఆవాలు – అర టీస్పూన్
మెంతులు – పావు టీస్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – పావు టీస్పూన్
నూనె – 3 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
Also Read: ఓవెన్ అక్కర్లేదు.. బెల్లం, రాగి పిండి ఉంటే చాలు.. కడాయిలోనే టేస్టీ బిస్కెట్లు రెడీ!
ముందుగా చిలగడదుంపలను శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి చిలగడదుంప ముక్కలను వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఇందులో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఉడికించిన చిలగడదుంప ముక్కలు, తగినంత ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత మరో చిన్న పాన్‌లో నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపును ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకుంటే సరి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశెలతో కూడా ఈ పచ్చడిని తినవచ్చు.
Also Read: బయట దొరికే పాస్తా కంటే 10 రెట్లు రుచిగా.. ఇంట్లోనే క్రీమీ చీజీ చికెన్ పాస్తా తయారీ విధానం!